ఝార్ఖండ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 43 నియోజక వర్గాల్లో 683 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సాయంత్రం 5 గంటలకు వరకు 64.86 శాతం ఓటింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బరిలో ఉన్న ప్రముఖులు వీరే!
ఝార్ఖండ్‌లో మొదటి విడత పోలింగ్ ముగిసింది. ఝార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉండగా తొలివిడతలో భాగంగా 43 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 950 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియగా, మిగిలిన చోట్ల 5 గంటలకు ఓటింగ్ ముగిసింది. తొలి విడతలో 683 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. పోలింగ్ కోసం 15,344 కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. తొలి విడత బరిలో ఉన్న అభ్యర్థుల్లో మాజీ సీఎం చంపయీ సోరెన్, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా, మాజీ సీఎం మధు కోడా సతీమణి గీతా కోడా ఉన్నారు.
ధోనీని చూసేందుకు ఎగబడిన జనం
మొదటి విడత పోలింగ్‌లో భాగంగా పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగవార్ రాంచీలోని ఏటీఐ కేంద్రంలో ఓటు వేశారు. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆయన సతీమణి కల్పనా సోరెన్ రాంచీలో ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని ఓటు వేసిన అనంతరం సోరెన్ పేర్కొన్నారు. ఒడిశా గవర్నర్, ఝార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్ కుటుంబ సభ్యులతో కలిసి జంషెడ్‌పూర్‌లో ఓటు వేశారు. కోడెర్మాలోని పోలింగ్ స్టేషన్‌లో కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి ఓటు వేశారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అర్జున్ ముండా, ఆయన భార్య మీరా సరాయ్ కెలాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన సతీమణి సాక్షి రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధోనీకి చూసేందుకు భారీగా అభిమానులు పోలింగ్ స్టేషన్ వద్దకు వచ్చారు.
రెండో విడత పోలింగ్ ఎప్పుడంటే?
81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో ఈ నెల 20న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 38 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 23న చేపట్టనున్నారు. గత ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి 25సీట్లు వచ్చాయి.
వయనాడ్లో 60.79 శాతం పోలింగ్
దేశమంతా ఎంతో ఆసక్తిగా చూసిన కేరళలోని వయోనాడ్ ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60.79 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఈ వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి యూడీఎఫ్ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఇంతకు ముందు ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరుసగా రెండు సార్లు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రాయ్ బరేలీ స్థానాన్ని ఉంచుకుని, వయనాడ్ స్థానానికి ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో ఇక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఇప్పుడు తన సోదరుని స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేశారు.