Jayalalitha Gold Jewellery Auction : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన బంగారు ఆభరణాలను ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ పీఎమ్ నవాజ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. జయలలిత మేనకోడలు జె దీప దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన బెంచ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ కేసును మే 26కి వాయిదా వేసింది.
కోర్టులో విచారణ సందర్భంగా జయలలిత తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అవినీతి ఆరోపణలపై సుప్రీం తీర్పు వెలువడక ముందే జయలలత మరణించారని, ఈ కారణంగా ఆమెపై ప్రభుత్వం మోపిన అభియోగాల నుంచి విముక్తి కల్పించాలని సుప్రీం తీర్పు ఉంది. అందువల్ల జయలలిత చట్టబద్ధమైన వారసురాలికే ఆమె బంగారు ఆభరణాలన్నింటిని అప్పగించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. ఈ వాదనలను రికార్డు చేసిన న్యాయస్థానం ఈ అంశంపై స్టే విధించింది. ఈ కేసులో అభ్యంతరాల దాఖలు చేయడానికి ప్రభుత్వానికి అవకాశం కల్పించింది.
అంతకుముందు మార్చి 6, 7 తేదీల్లో జయలలితకు సంబంధించిన బంగారు, వజ్రాభరణాలను తీసుకునేందుకు ఆరు ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని బెంగళూరు సివిల్, సెషన్స్ కోర్టు గతంలో ఆదేశించింది. 'ఆ బంగారు ఆభరణాలు తీసుకోవడానికి ఒక అధికారిని నియమించాం. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలి. ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలు, అవసరమై భద్రత సిబ్బందితో వచ్చి బంగారు ఆభరణాలను తీసుకోవాలి. తమిళనాడు డిప్యూటీ ఎస్పీ ఈ విషయాన్ని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాలి. ఆ రోజుల్లో భద్రతకు స్థానిక పోలీసులను ఏర్పాటు చేసుకోనేలా చర్యలు తీసుకోవాలి' అని కొద్ది రోజుల క్రితం న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం రూ.5కోట్లు ఖర్చు చేసిందని న్యాయవాది ఈటీవీ భారత్కు తెలిపారు. ఇందుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం రూ.5కోట్ల డీడీని కర్ణాటకకు ఇదివరకే అందించిందని చెప్పారు. అయితే, ఆ మొత్తం ఇంకా కర్ణాటక ఖజానాలో జమ అవ్వలేదని వివరించారు.
కర్ణాటక ప్రభుత్వం దగ్గర ఉన్న వస్తువులు
అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. అందులో 7,040 గ్రాముల 468 రకాల బంగారు, వజ్రాభరణాలు; 700 కిలోల వెండి వస్తువులు; 740 ఖరీదైన చెప్పులు ఉన్నాయి. వాటితో పాటు 11,344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 8 వీసీఆర్‌లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, రూ.1,93,202 నగదును స్వాధీనం చేసుకున్నారు.అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు 2014లో బెంగళూరు కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది. అలాగే స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బీఐ, ఎస్బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. అయితే ఇంతలోనే జయలలిత మరణించారు. ఈ క్రమంలోనే దీనిపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఆదేశించింది.
రూ.100 కోట్ల జరిమానా వసూల్- 28 కిలోల జయలలిత బంగారు నగలు వేలం
దేశంలోనే ఫస్ట్ అండర్వాటర్ మెట్రో- టన్నెల్లో ఎలా దూసుకెళ్తుందో చూశారా?