Jammu and Kashmir Assembly elections 2024 : కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికలకు బీజేపీ మరో 29 మంది అభ్యర్థుల పేర్లను మంగళవారం ప్రకటించింది. దీంతో బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 45కు చేరింది. తాజాగా ప్రకటించిన జాబితాలోని 10 మంది రెండో దశ ఎన్నికల్లో, 19 మంది మూడో దశ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 90 మంది శాసనసభ సభ్యులు గల జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో సెప్టెంబరు 18, 25, అక్టోబరు ఒకటో తేదీన జరగనున్నాయి.
జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకే కాంగ్రెస్‌తో సీట్ల పంపకం ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా గందేర్‌బల్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారని మంగళవారం ఆ పార్టీ వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య కుదిరిన పొత్తు ప్రభావం బీజేపీపై ఏమాత్రం ఉండబోదని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ వ్యాఖ్యానించారు. అక్కడ తమ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు
జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒప్పందం ప్రకారం 32 చోట్ల కాంగ్రెస్, 51 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పోటీ చేయనున్నాయి. ఐదు స్థానాల్లో కాంగ్రెస్, ఎన్‌సీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని తెలిపారు. మిగితా రెండు స్థానాల్లో సీపీఎం, జేకేఎన్‌పీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
ఓటుహక్కు వినియోగించుకునేలా
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న జమ్మూకశ్మీర్ వలసదారులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు గాను, ఆ రాష్ట్ర యంత్రాంగం ఓ సహాయకేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా వివిధ ప్రాంతాలకు వలసవెళ్లిన ఓటర్లు, ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో, పోస్టల్ బ్యాలెట్‌ల ద్వారా ఎలాంటి ఇబ్బందిలేకుండా ఓటువేసేందుకు వీలు కలుగుతుంది.
2014లో చివరిసారిగా ఎన్నికలు
జమ్ముకశ్మీర్‌లో చివరగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. 2019లో కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలు (జమ్ముకశ్మీర్, లద్దాఖ్)గా విభజించింది. కనుక ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి, జమ్ముకశ్మీర్‌లో పాగావేయాలని ఇరుపార్టీలు ప్రణాళికలు వేస్తున్నాయి.