Jaipur Ancient Ram Temple : రాజస్థాన్లోని జయపురలో ఉన్న ఓ రామాలయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయోధ్యలోని కనక్ భవన్ తరహాలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. శ్రీరాముడు తన సతీమణి సీతమ్మ, సోదరులు లక్ష్మణుడు, భరతుడు, శత్రుజ్ఞుడు కలిసి ఈ దేవాలయంలో కొలువుదీరారు. దాదాపు 130 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ గుడి అందమైన శిల్పకళతో చూపరులను ఆకట్టుకుంటోంది. అందుకే శ్రీరామనవమి పర్వదినంతోపాటు సాధారణ రోజుల్లో కూడా ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.
అద్బుతంగా శిల్పకళ
జయపుర వారసత్వ జాబితాలో శ్రీరాముడి ఆలయం ఇటీవలే చేరింది. ఈ ఆలయం ఉత్తర భారతదేశంలో ఉన్న పురాతమైన దేవాలయాల్లో ఒకటి. రాముడు తన సోదరులు, భార్యతో కలిసి ఉన్న ప్రతిమలను ఈ దేవాలయం నెలకొల్పారు. జయపురలోని పర్కోటా ప్రాంతంలోని చాంద్‌పోల్ బజార్‌లో ఉన్న ఈ శ్రీ రామచంద్రుని ఆలయ శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు శ్రీరాముడు తమను చూస్తున్నట్లుగా భావించే విధంగా ఇక్కడ దేవుడి విగ్రహం ఉంటుంది. అంతేగాక ఈ ఆలయానికి అయోధ్యతో కూడా ప్రత్యేక అనుబంధం ఉంది.
నిర్మాణానికి 20 ఏళ్లు
శ్రీరామనవమి వేడుకలు జయపురలోని రాముడి దేవాలయంలో ఏటా ఘనంగా జరుగుతాయి. రామయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూజారులు. శ్రీరామ నవమి నాడు స్వామిని ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ ఆభరణాలన్నీ రాజుల కాలం నాటివే. శ్రీరామనవమి వంటి పర్వదినాల్లో స్వామివారికి ఈ ఆభరణాలతో అలంకరిస్తారు. లాంతరు లేకుండా ఆలయ పైకప్పును అప్పట్లో నిర్మించారు. ఆలయ నిర్మాణంలో మక్రానా పాలరాతిని వాడారు. రామచరితమానస్‌లోని సంఘటనలు గుడి గోడలపై చెక్కారు. అందుకే ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 20 ఏళ్లు పట్టింది.
రోడ్డుపై నుంచి కూడా రామయ్య దర్శనం
ఈ ఆలయం 130 ఏళ్ల క్రితం నిర్మితమైందని ఆలయ పూజారి నరేంద్ర తివారీ తెలిపారు. మహారాజా రామ్ సింగ్ భార్య గులాబ్ కన్వర్ ధీరావత్ 1894లో ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పారు. ఈ రామాలయంలో అందమైన శిల్పాలు, పెయింటింగ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అయోధ్యలోని కనక్ భవన్ తరహాలో నిర్మితమైందని చెప్పుకొచ్చారు. ఈ ఆలయంలో ఉన్న భగవంతుడ్ని రోడ్డుపై నుంచి కూడా చూడొచ్చని అన్నారు. అలంకారం తర్వాత ఠాకూర్ జీ(శ్రీరాముడు) ప్రతి భక్తుడిని చూస్తున్నట్లు కనిపిస్తారని చెప్పారు. రామనవమితో పాటు వైశాఖ శుక్ల పంచమి రోజున రామయ్య గుడిలో పాటోత్సవ్ నిర్వహిస్తామని తెలిపారు. శ్రీరామనవమి తర్వాత రోజు జానకీ మాత పాద ముద్రికలు భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. ఆ పాదాలను చూసే వారు అదృష్టం కలిసి వస్తున్నందని నమ్ముతారు భక్తులు.