IT Notice to CPI : కాంగ్రెస్ పార్టీకి రూ.1,823 కోట్లకు పైగా పన్నులు చెల్లించాలని నోటీసులు పంపిన ఆదాయపు పన్నుశాఖ, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా- సీపీఐకి నోటీసులు జారీ చేసింది. పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు పాత పాన్ కార్డును ఉపయోగించినందుకు రూ.11 కోట్ల బకాయిలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో ఐటీ అధికారులను సవాలు చేస్తూ లెఫ్ట్ పార్టీ తమ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతోంది.
72గంటల్లో 11నోటీసులు
లోక్‌సభ ఎన్నికల వేళ ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సాకేత్ గోఖలే ఆరోపించారు. 72 గంటల్లో ఆదాయపు పన్ను శాఖ నుంచి తనకు 11 నోటీసులు వచ్చాయని వెల్లడించారు. వాటిలో కొన్ని నోటీసులు ఏడేళ్ల క్రితానివని చెప్పారు. ఈ మేరకు నోటీసుల ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
'బీజేపీ ఎందుకు ఈ తెగింపు?'
"గత 72 గంటల్లో మొత్తం 11 ఆదాయపు పన్ను నోటీసులు వచ్చాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయని మోదీ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈడీ పనిచేయకపోతే ఐటీ. బీజేపీ ఎందుకు ఈ తెగింపు?" అని సాకేత్ గోఖలే ప్రశ్నించారు.
కీలక సమయంలో ఇలా!
మరోవైపు, సార్వత్రిక ఎన్నికల వేళ రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసులు రావడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కీలక సమయంలో తమ పార్టీని ఆర్థికంగా కుంగదీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఎన్నికలు జరగనున్న అత్యంత కీలక సమయంలో ఐటీ శాఖను తమపై ప్రయోగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడింది. ఇప్పటికే రూ.135 కోట్లు తమ ఖాతా నుంచి బలవంతంగా తీసుకున్నారని, తాజాగా మరో 1,823.08 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారని పేర్కొంది.
దేశవ్యాప్తంగా నిరసనలు
ఆర్థిక ఉగ్రవాదాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో శనివారం (మార్చి 30న) పెద్దఎత్తున నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేసింది. ఈ చర్యలను ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొన్న కాంగ్రెస్- పన్ను ఉగ్రవాదాన్ని నిరసిస్తూ అన్ని పీసీసీల ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని సూచించింది. సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. పార్టీ అభ్యర్థుల సమక్షంలో నియోజకవర్గాల్లో కూడా నిరసనలు చేపట్టాలని సూచించారు.