IRCTC Refund Process For Failed Transaction : సాధారణంగా మనమంతా రైలు ప్రయాణం కోసం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేస్తుంటాం. కానీ కొన్నిసార్లు టికెట్ బుక్ కాకపోయినా అకౌంట్లో డబ్బులు మాత్రం కట్ అయిపోతాయి. టికెట్ మాత్రం బుక్ కాదు. అలాంటి సందర్భాల్లో ఐఆర్‌సీటీసీ ఆ డబ్బులను రిఫండ్ చేస్తుంది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.
గంటల్లో రీఫండ్ డబ్బులు
అయితే ఆ డబ్బులు మళ్లీ మన అకౌంట్లో జమ అవ్వడానికి కొన్ని రోజుల టైమ్ పడుతుంది. మూడు నాలుగు రోజుల్లో రిఫండ్ అవుతాయి. ఇప్పుడు ఈ సమస్యకు మరికొద్ది రోజుల్లోనే పరిష్కారం లభించనుంది. రిఫండ్ ప్రక్రియను ఐఆర్‌సీటీసీ వేగవంతం చేయనుంది. దీంతో గంట లేదా కొన్ని గంటల్లోనే నగదు వెనక్కి రానుందని పలు మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.
రిఫండ్ల గురించి ఎప్పటికప్పుడు యూజర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అన్నిరకాల రిఫండ్లకు ఏకరూపత తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిఫండ్ల జారీకి పడుతున్న సమయాన్ని గణనీయంగా తగ్గించాలని రైల్వే బోర్డు సంబంధిత విభాగాలకు ఈ ఏడాది జనవరిలోనే ఆదేశించింది. ఈ క్రమంలోనే ఐఆర్‌సీటీసీ, ఆ సంస్థకు ఐటీ సేవలందించే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్-CRIS ప్రస్తుతం దీనిపై పనిచేస్తున్నాయి.
సాధారణంగా టికెట్లు బుక్ కాని సందర్భంలో తదుపరి రోజు ఐఆర్‌సీటీసీ ఆ ప్రక్రియను మొదలుపెడుతోంది. ఆ తర్వాత బ్యాంకులు/ పేమెంట్ గేట్‌వేలు ఆ ప్రక్రియను ప్రారంభిస్తున్నాయి. ఇందుకోసం 3-4 పనిదినాలు పడుతోంది. డెబిట్/ క్రెడిట్ కార్డు వినియోగించిన సందర్భాల్లో వారం కూడా అవుతోంది. టికెట్టు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నపుడు టికెట్ క్యాన్సిల్ అయినప్పుడు కూడా ఇదే పరిస్థితి.
అయితే టీడీఆర్ విషయంలో మరింత ఎక్కువ సమయం పడుతోంది. ప్రస్తుతం మానవ సంబంధం లేకుండా అన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతున్న వేళ రిఫండ్ల జారీకి మాత్రం ఎందుకింత ఆలస్యం జరుగుతోందన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ రిఫండ్ల జారీ గడువుపై దృష్టి సారించింది.
'ఎలక్టోరల్ బాండ్ల లెక్క ఇదీ!'- సుప్రీంకోర్టులో స్టేట్ బ్యాంక్ అఫిడవిట్
'కాంగ్రెస్ గెలిస్తే మహిళలకు ఏడాదికి రూ.లక్ష- ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు'