IRCTC Hyderabad Karnataka Tour: కర్ణాటకలోని ప్రముఖ ప్రదేశాలను చూడాలని అనుకుంటున్న వారి కోసం ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని ఉడుపి, శృంగేరి, మురుదేశ్వర్ తదితర ప్రాంతాలను చూసేందుకు సూపర్ ప్యాకేజీని ప్రకటించింది. మరి ఈ ప్యాకేజీ ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెళ్లే ప్రయాణికుల కోసం "కోస్టల్ కర్ణాటక(Coastal Karnataka)"’ పేరుతో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలను సందర్శించడానికి IRCTC ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. రైలు ప్రయాణం ద్వారా సాగే ఈ టూర్ ప్రతీ మంగళవారం ఉంటుంది. ప్రస్తుతం జూన్ 25న టూర్ అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు సాగనుంది. ఈ ప్యాకేజీలో ఉడిపి, శృంగేరి, మురుడేశ్వర్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.
ప్రయాణం వివరాలు ఇవే:
- మొదటి రోజు కాచిగూడ స్టేషన్ నుంచి కాచిగూడ - మంగుళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్(ట్రైన్ నెం 12789) ఉదయం 06.05 రైలు బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 09.30 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడ్నుంచి పికప్ చేసుకుని ఉడిపికి తీసుకెళ్తారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత శ్రీకృష్ణ ఆలయం, సెయింట్ మేరీ ఐల్యాండ్, మల్పే బీచ్ విజిట్ చేస్తారు. రాత్రి ఉడిపిలోనే స్టే చేస్తారు.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కొల్లూరు స్టార్ట్ అవుతారు. అక్కడ మూకాంబికా ఆలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత కొల్లూరు నుంచి మురుడేశ్వర్‌కు చేరుకుంటారు. అక్కడ శివుడి ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం గోకర్ణకు బయలుదేరుతారు.
- అక్కడ టెంపుల్‌ను విజిట్ చేసిన తర్వాత బీచ్‌లో ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్లీ ఉడిపికి రిటర్న్ అవుతారు. నైట్ ఉడిపిలోనే స్టే ఉంటుంది.
- నాలుగో రోజు ఉడిపి నుంచి చెక్ అవుట్ అయ్యి హోరనాడు బయలుదేరుతారు. అక్కడ అన్నపూర్ణ దేవి ఆలయాన్ని దర్శించుకోవాలి. అక్కడి నుంచి శృంగేరికి స్టార్ట్ అవుతారు. అక్కడ శారదాంబ టెంపుల్ దర్శించుకుని సాయంత్రానికి మంగుళూరుకు బయలుదేరుతారు. రాత్రి మంగుళూరులోనే బస ఉంటుంది.
- ఐదో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి మంగుళూరులోని మంగళదేవి టెంపుల్, కద్రి శ్రీ మంజునాథ ఆలయం దర్శించుకోవాలి. సాయంత్రం తన్నిర్భావి బీచ్, కుద్రోలి శ్రీ గోకర్ణనాథ క్షేత్రం దర్శనం ఉంటుంది. రాత్రి 7 గంటల వరకు మంగళూరు సెంట్రల్‌కు చేరుకుని హైదరాబాద్ కు తిరుగు పయనం అవుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- ఆరో రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడకు చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.
టికెట్ ధరలు:
- కంఫర్ట్ క్లాస్‌లో సింగిల్ షేరింగ్ రూ. 37,790, డబుల్ షేరింగ్ కు రూ.21,820, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.17,420గా ఉంది.
- ఇక స్టాండర్డ్ క్లాస్‌లో చూస్తే సింగిల్ షేరింగ్‌కు రూ.34,980, డబుల్ షేరింగ్‌కు రూ.18,830, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.14,420 ధరగా నిర్ణయించారు.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.