INS Jatayu Indian Navy Ship : 'ఐఎన్‌ఎస్ జటాయు' పేరుతో భారత్ సరికొత్త నౌకాదళ స్థావరాన్ని వచ్చే వారం మాల్దీవులకు సమీపంలో ప్రారంభించనుంది. దీంతో హిందూ మహా సముద్రంపై మన దేశ నిఘా వ్యవస్థను మరింత పెంచుకునే అవకాశం లభించనుంది. లక్షద్వీప్‌లోని మినికాయ్ ద్వీపంపై ఏర్పాటు చేసిన ఈ స్థావరంలో తొలుత కొందరు అధికారులతో పాటు తక్కువ మంది సిబ్బంది మాత్రమే ఉంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో దీనిని అతిపెద్ద నౌకాదళ స్థావరాల్లో ఒకటిగా మారుస్తామని చెబుతున్నాయి.
ఐఎన్‌ఎస్ బాజ్లాగే జటాయువు సేవలు
విమాన వాహక నౌకలైన 'ఐఎన్‌ఎస్ విక్రాంత్', 'ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య'లపై కమాండర్స్ కాన్ఫరెన్స్ ప్లాన్ జరగనుంది. అయితే ఈ రెండు భారీ నౌకలు కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొననుండటం ఇదే మొదటిసారి. ఆ సందర్భంగానే 'ఐఎన్‌ఎస్ జటాయు' స్థావరాన్ని కూడా ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే తూర్పున అండమాన్-నికోబార్ ద్వీపాల్లో ఉన్న 'ఐఎన్‌ఎస్ బాజ్' స్థావరం మాదిరిగానే పశ్చిమాన 'జటాయు' నౌకాదళ స్థావరం సేవలు అందించనుంది.
దళంలోకి 4 కొత్త హెలికాప్టర్లు
'ఐఎన్‌ఎస్ జటాయు' నౌకాదళ స్థావరం మాల్దీవుల్లోని ద్వీపాలకు దాదాపు 50 మైళ్ల దూరంలో ఉంటుంది. హిందూ మహా సముద్రంలో సైనిక, వాణిజ్య నౌకల కదలికలను పరిశీలించడానికి ఈ స్థావరం ద్వారా భారత్‌కు అవకాశం లభిస్తుంది. మరోవైపు అమెరికా నుంచి కొనుగోలు చేసిన 4 ఎంహెచ్-60 హెలికాప్టర్లను కూడా వచ్చేవారం కొచ్చిలో నౌకాదళంలోకి చేర్చుకోనున్నారు. అలాగే గోవాలో నిర్మించిన నౌకాదళ కళాశాలను కూడా ఈ సందర్భంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
జటాయు నౌకాదళ స్థావరానికి సమీపంలోనే నౌకాదళం ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను మోహరించి ఉంచే అవకాశాలున్నాయి. కమాండర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా నేవీకి చెందిన యుద్ధ విమానాలు ఒక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌పై నుంచి టేకాఫ్ అయి మరో దానిపై ల్యాండింగ్ కావడం లాంటి హైటెంపో ఆపరేషన్లను నిర్వహించనుంది. జలాంతర్గాములు, మరికొన్ని యుద్ధ నౌకలు కూడా ఈ సందర్భంగా క్యారియర్ గ్రూప్ కార్యకలాపాల్లో పాల్గొంటాయని డిఫెన్స్ అధికారులు తెలిపారు. అలాగే గ్లోబల్ మిలిటరీల కోసం ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను తయారు చేయగల సామర్థ్యం భారత్‌కు ఉందని తెలిపే విధంగా నిర్వహించే ప్రదర్శన కోసం విశాఖపట్నంలో రెండు క్యారీయర్లను సిద్ధంగా ఉంచారు.
రామేశ్వరం కేఫ్‌లో పేలుడు- ఐదుగురికి గాయాలు, అదే కారణం!
ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీరోడ్డు నిర్మాణం- కాలేజీ పరిశోధనకు పేటెంట్