Indore Congress Candidate Nomination Withdrawal : లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ లోక్‌సభ నియోజకవర్గం హస్తం పార్టీ అభ్యర్థి అక్షయ్ కాంతి బమ్ అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఆఖరు నిమిషంలో తన నామినేషన్‌ను వెనక్కు తీసుకోవడం సహా పార్టీని వీడి బీజేపీ తీర్థ పుచ్చుకున్నారు.
ఇందౌర్ లోక్‌సభ నియోజకవర్గానికి నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు నేడే (ఏప్రిల్ 29) ఆఖరి తేదీ. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం అక్షయ్, కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను వెనక్కు తీసుకున్నారు. ఆయన వెంట బీజేపీ శాసనసభ్యుడు రమేశ్ మెండోలా ఉండటం చర్యనీయాంశమైంది.
అక్షయ్ కమలదళంలో చేరిన విషయాన్ని రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత కైలాశ్ విజయ్‌వర్గియ ధ్రువీకరించారు. ఆయనతో ఒకే కారులో వెళ్తున్న ఫొటోను షేర్ చేశారు. అక్షయ్‌ను బీజేపీలోకి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇందౌర్ నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ శంకర్ లల్వానీ బరిలో ఉన్నారు. బీఎస్పీతో పాటు స్వతంత్రులు కొంతమంది ఇక్కడ నుంచి బరిలో నిలిచారు.
కమలం గెలుపు లాంఛనమే!
బీజేపీకి ప్రధాన పోటీదారు అయిన కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ నామినేషన్ విత్‌డ్రా చేసుకోవడం వల్ల, శంకర్ విజయం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. అయితే, సోమవారం సాయంత్రం వరకు పోటీలో ఉన్న ఇతరులు కూడా నామినేషన్లను విత్‌డ్రా చేసుకుంటే సూరత్ తరహాలోనే ఇక్కడ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇటీవల గుజరాత్‌లోని సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అనంతరం పోటీలో ఉన్న ఇతరులు కూడా నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. తద్వారా బీజేపీ నేత ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా గెలుపొందారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మొదటి విజయం దక్కినట్లయింది.
ప్రజాస్వామ్యానికి ముప్పు : కాంగ్రెస్
ఈ పరిణామాన్ని ప్రజాస్వామ్యానికి ముప్పులా కాంగ్రెస్ అభివర్ణించింది. అభ్యర్థులను ఒకరి తర్వాత ఒకరిని బెదిరిస్తున్నప్పుడు, ఎన్నికల సంఘం అవేవీ పట్టించుకోనప్పుడు, ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరుగుతున్నాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాని కార్యాలయంలో కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ మీడియాతో మాట్లాడారు. 'ఆయనకు (అక్షయ్ కాంతి బమ్) రాష్ట్రంలో అనేక విశ్వవిద్యాలయాలు, కాలేజీలు ఉన్నాయి. ఆయనపై ఓ హత్యారోపణ కూడా ఉంది. ఇలా ఎవరైనా తమ నామినేషన్ విత్‌డ్రా చేసుకుని బీజేపీలో చేరడం సాధారణం కాదు. మేము భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెబుతుంటాం. మేం చెప్పేది దీని గురించే. అభ్యర్థులను మభ్యపెట్టడం, భయపెట్టడం, ఉపసంహరించుకునేలా చేయడం, వారిపై ఒత్తిడి తీసుకురావడం ఇదే ఇప్పుడు జరుగుతోంది.' అని బీజేపీపై సుప్రియా మండిపడ్డారు.