INDIA Improved In 2024 Lok Sabha Elections : 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అనూహ్య ఫలితాలు సాధించింది. ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తూ బీజేపీ కూటమిని నిలువరించకపోయినా, ఒక బలమైన ప్రతిపక్షంగా ఉండేందుకు చేసిన ప్రయత్నంలో సఫలం అయింది. సమర్థమైన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు తన బలాన్ని మరింత పెంచుకుంది. భవిష్యత్తులో అధికారం చేపడుతుందని కచ్చితంగా చెప్పకపోయినా, ఈ ఫలితాల సానుకూలత కాంగ్రెస్ చేసే ప్రతి ప్రయత్నంపై ప్రభావం చూపిస్తుంది.
2019 లోక్‌సభ పోల్స్‌లో 52 సీట్లు సాధించిన కాంగ్రెస్, ఈ ఎన్నికల్లో తన బలాన్ని గణనీయంగా పెంచుకుంది. ఇతర ప్రధాన పార్టీలు కూడా అదే తరహాలో గట్టి పోటీ ఇచ్చాయి.
ఫలించిన ప్రయత్నం
2019లో 303 సీట్లు సాధించి భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీని ఒడించాలంటే పటిష్ఠ ప్రణాళిక, అంతకు మించిన కసరత్తు అవసరం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇండియా కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహించింది. అయితే బీజేపీ వంటి భారీ కొండను ఢీకొట్టడమే చాలా కష్టం. అలాంటిది వివిధ రాష్ట్రాల్లో విభిన్న సామాజిక సమీకరణాలు, సిద్ధాంతాలతో పనిచేసే పార్టీలను ఏకం చేయడం, వివిధ గుర్తులపై పోటీ చేస్తూ ఒకే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం దాదాపు అసాధ్యం. అందులో కొన్ని పార్టీల సిద్ధంతాలు కాంగ్రెస్‌కు పూర్తి విరుద్ధంగా ఉంటే ఆ ప్రయాణం కత్తిమీద సామే.
ఇంత విభిన్నమైన ఇండియా కూటమిలో క్రమంగా దూరాలు పెరిగాయి. విభేదాలు తలెత్తాయి. సమన్వయ కమిటీలు శ్రమించినా పార్టీల మధ్య రాజీ కుదుర్చలేకపోయాయి. ఫలితంగా బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష పార్టీ సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇక బిహార్‌లో నీతీశ్ ఏకంగా ఎన్డీఏలో చేరారు. ఇలాంటి పరిస్థితులల్లోనూ కాంగ్రెస్ నమ్మకం కోల్పోకుండా, చాలా వరకు సంయమనం పాటించి కూటమి పార్టీలతో కలసి అడుగులు వేసింది. పార్టీల మధ్య విభేదాలను తగ్గించేందుకు కృషి చేసింది. ఏది ఏమైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల్లో కూటమిగా విజయవంతంగా పోటీ చేసింది. కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు సఫలీకృతమై తాజా ఫలితాల్లో హస్తం పార్టీతో పాటు డీఎంకే, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ వంటి 'ఇండియా' పార్టీలు మంచి పనితీరు కనబర్చాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ ఆధిపత్యాన్ని సవాల్ చేసింది.
సమస్యలపై పోరాటం
బీజేపీ 'వైఫల్యాలను' ఇండియా కూటమి సమర్థంగా ఎండగట్టింది. ధరల పెరుగుదల, అవినీతి, అగ్నివీర్ స్కీమ్, పరీక్షల లీకులు వంటి అనేక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసింది. అయితే ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి, ఆక్రోశాన్ని ఇండియా కూటమి క్యాష్ చేసుకోవడంలో కాస్త విఫలమైంది. సీట్ల సర్దుబాటు కారణంగా ఇండియా సరైన అభ్యర్థులను నిలబెట్టలేకపోయిందని, ప్రజల్లో ప్రభుత్వంపై కోపం ఉన్నా వేరే ఆప్షన్ లేక ఎన్డీఏకు ఓటు వేయాల్సి వచ్చిందిని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట్లల్లో నిజం లేకపోలేదు. ఇక కొన్ని రాష్ట్రాల్లో కూటమి పార్టీల మధ్య పోటీ మైనస్ పాయింట్.