IMA On NEET UG 2024 Issue : నీట్-యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) స్వాగతించింది. సమగ్ర విచారణ కోసం సీబీఐకి బదిలీ చేసినందుకు విద్యామంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపింది. పరీక్ష నిర్వహణ చుట్టూ వివాదాల నెలకొన్న వేళ సత్వరమే స్పందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్రమంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్‌కు ఐఎంఏ కృతజ్ఞతలు తెలిపింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్‌ను తొలగించినందుకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఆదివారం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఐఎంఏ పేర్కొంది. "పోటీ పరీక్షల్లో అవకతవకలను పరిష్కరించడానికి ప్రభుత్వం కఠినమైన చట్టాలను రూపొందించినందుకు అభినందిస్తున్నాం. విద్యార్థులే దేశ రేపటి భవిష్యత్తు. ముఖ్యమైన పోటీ పరీక్షలను అత్యంత శ్రద్ధగా, గోప్యతతో నిర్వహించడం చాలా కీలకం" అని ఐఎంఏ తెలిపింది.
"నీట్-పీజీ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంస్కరణల అనివార్యమైన పరిణామమని మేం విశ్వసిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా బలమైన యంత్రాంగాన్ని మేం ఆశిస్తున్నాం" అని ఐఎంఏ తెలిపింది. మెడికల్, డెంటల్, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ సకాలంలో ప్రారంభమయ్యేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని ఐఎంఏ కోరింది. పోటీ పరీక్షలపై ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా జూన్ 23న జరగాల్సిన నీట్-పీజీని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వాయిదా వేసింది.
పూర్తి సేఫ్‌గా!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్‌తోపాటు ఎన్టీఏకు సంబంధించిన ఇతర వెబ్ పోర్టల్‌లు పూర్తి సురక్షితంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయని వస్తున్న ఇటీవల వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన చెప్పారు.
813 మంది మాత్రమే!
మరోవైపు, నీట్-యూజీ పరీక్షలో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల్లో 813 మంది ఆదివారం మరోసారి పరీక్షకు హజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వారు పరీక్ష రాశారని పేర్కొంది. ఇందుకోసం ఏడు పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారని NTA వర్గాలు వెల్లడించాయి. మరోవైపు బిహార్‌లో నీట్-యూజీ పరీక్ష రాసిన 17 మంది మాల్ ప్రాక్టీస్ చేసినట్టు గుర్తించడం వల్ల డీబార్ చేస్తినట్టు NTA తెలిపింది. అంతకుముందు 63 మందిని డీబార్ చేసినట్టు ప్రకటించింది. గుజరాత్‌లో 30 మందిని డీబార్ చేసినట్టు తెలిపింది.