How To Make Makhana Kheer Recipe : మనలో చాలా మంది పాయసాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. పండగల సమయంలో ఏదైనా స్వీట్ వంటకం తయారు చేయాలనుకుంటే చాలా మంది పాయసం చేస్తారు. అయితే.. ఇందుకోసం సేమ్యా, సగ్గుబియ్యం ఉపయోగిస్తారు. కానీ.. మరో ఐటమ్‌తో కూడా పాయసం చేయొచ్చని మీకు తెలుసా? అదే.. మఖానా! దీంతో.. పాయసం చేస్తే.. ఇంట్లోని వారందరూ ఫిదా అవ్వాల్సిందే. ఎంతో రుచికరంగా ఉండటంతోపాటు, ఆరోగ్యానికి కూడా మేలు చేసే మఖానా కీర్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మఖానా పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
- మిల్క్- రెండు కప్పులు
- యాలకుల పొడి 1/2 టీస్పూన్
- జీడిపప్పులు -10
- బాదం పప్పులు -10
- ఎండుద్రాక్షలు- చెంచాన్నర
- పంచదార- నాలుగు చెంచాలు
- కుంకుమపువ్వు- చిటికెడు
- నెయ్యి- మూడు చెంచాలు
- ఫూల్ మఖానా- కప్పు
మఖానా పాయసం ఎలా తయారు చేయాలి ?
- ముందుగా పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పులు, బాదం పప్పులు, ఎండుద్రాక్షలు తక్కువమంట మీద వేయించుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అదే పాత్రలో కప్పు మఖానా వేసుకొని సన్నటి మంటపై వేయించి, మరో పాత్రలోకి తీసుకోవాలి.
- తర్వాత ఒక పాత్రలో పాలని వేసి.. అడుగంటకుండా గరిటెతో కలుపుతూ పాలు కాస్త దగ్గరగా వచ్చేంతవరకూ కాచాలి.
- ఆ తర్వాత పాలలోకి సరిపడినంత చక్కెర వేసుకుని మళ్లీ కలుపుకోవాలి.
- ఇప్పుడు ఫ్రై చేసుకున్న మఖానాను పాలలో వేసి కలుపుకోవాలి.
- తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ను పాలలో వేసి లో ఫ్లేమ్‌లో గరిటెతో కలపాలి.
- ఇప్పుడు పాయసంలో కుంకుమ పువ్వు, యాలకుల పొడిని కలపుకోవాలి.
- అంతే ఎంతో సింపుల్‌గా రెడీ అయ్యే మఖానా కీర్ రెడీ.
- దీనిని వేడి వేడిగా గానీ లేదా చల్లగా అయినా తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది.
మఖానాలో ఉండే పోషకాలు..
- మఖానాలో ప్రొటీన్లు, ఫైబర్‌తోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి.
- వీటిని తినడం వల్ల రక్తహీనత, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
- వీటిలో ఉండే క్యాల్షియం, ఐరన్ వంటి గుణాలు గర్భిణులకు మేలు చేస్తాయి. వారిలో రక్తహీనత సమస్య రాకుండా కాపాడతాయి.
- మఖానాలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్, ఆర్థ్రైటిస్.. తదితర సమస్యలు రాకుండా కాపాడతాయి.
కోడి గుడ్డుతో 10 వెరైటీ రెసిపీస్ - మీరు ఎప్పుడూ టేస్ట్ చేయని రకాలు!
కార్తికమాసం స్పెషల్ - ఉసిరి-గోధుమరవ్వ పులిహోరతో స్వామివారికి నైవేద్యం పెట్టండి!