How To Make Mango Mutton Curry in Telugu : వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. చాలా మంది స్తోమత లేక చికెన్‌ను ఎక్కువగా తింటుంటారు. కానీ మటన్‌పై మాంసాహారులకు ఉండే మోజే వేరు. వారానికొకసారి వీలు కాకపోయినా.. నెలకోసారైనా తినాలనుకుంటున్నారు. మటన్ రేటు ఎక్కువ ఉన్నా సరే ముక్క నోట్లో పడాల్సిందేననుకుంటారు. అయితే రొటీన్‌గా మటన్ కర్రీ వండుకోవడంలో మజా ఏముంటుంది మరి. ఈ వారం మటన్‌కు కాస్త మామిడికాయను కూడా యాడ్ చేశారనుకోండి.. టేస్ట్ అదిరిపోతుంది. మటన్‌తో మామిడికాయ ఏంటి అనుకుంటున్నారా? నిజమండీ బాబు.. పచ్చిమామిడితో మటన్ కర్రీ చేస్తే మళ్లీ మళ్లీ తినాల్సిందే అంటారు. మరి పచ్చమామిడి మటన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామా?
మామిడికాయ మటన్‌కు కావాల్సిన పదార్థాలు :
(Mano Mutton Curry Ingredients)
- మామిడికాయ- ఒకటి (చిన్న ముక్కలు)
- బోన్‌లెస్ మటన్ - అరకేజీ
- ఆమ్‌చూర్ పొడి - టీ స్పూన్
- పెరుగు - ముప్పావు కప్పు
- పసుపు - టీస్పూన్
- నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు
- ఆవాలు - టీస్పూన్
- జీలకర్ర - టీస్పూన్
- కరివేపాకు రెబ్బలు - పది
- లవంగాలు - అయిదు
- దాల్చిన చెక్క - చిన్నముక్క
- పెద్ద ఉల్లిపాయలు - రెండు (చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి)
- అల్లం పేస్టు - టేబుల్‌స్పూన్
- ధనియాల పొడి - టేబుల్ స్పూన్
- కారం - టేబుల్‌స్పూన్
- గరంమసాలా - టీస్పూన్
- ఉప్పు - తగినంత
మామిడికాయ మటన్ ఎలా చేయాలంటే :
ముందుగా మటన్ ముక్కలను నార్మల్ హాట్ వాటర్‌తో కడిగేయండి. నీళ్లు లేకుండా మటన్ ముక్కలను ఓ గిన్నెలోకి తీసుకోండి. ఆ తర్వాత ఆ ముక్కలకు పెరుగు, ఆమ్‌చూర్ పొడి, పసుపు దట్టించి కుదిరితే పావుగంట సేపు లేదా 5 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో మారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ కిచెన్‌లో ఉన్న ఓ మందపాటి గిన్నెను తీసుకోండి. కాస్త పెద్దగిన్నె అయితే కలుపుకునేందుకు ఈజీగా ఉంటుంది. ఆ గిన్నెలో సరిపడా నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, లవంగాలు, దాల్చినచెక్క వేయాలి, అవన్నీ చిటపటలాడాక ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి.
ఆ తర్వాత మటన్ ముక్కలు వేసి కాస్త ఫ్రై అయ్యాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి ఒక రెండు నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంతవరకు వేయించాలి. తర్వాత ధనియాల పొడి, కారం, గరంమసాలా పొడి, మామిడికాయ ముక్కలు వేసి వీటిని బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు వేయించాలి. అవి వేగాక రెండు కప్పుల నీళ్లు పోసి స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని, మూత పెట్టి మటన్ ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి. మటన్ ఉడికిన తర్వాత ఉప్పు వేసి సన్నటి మంట మీద గ్రేవీ చిక్కగా అయ్యేంతవరకు ఉంచితే టేస్టీ టేస్టీ మామిడికాయ మటన్ కర్రీ రెడీ అయినట్టే. ఈ కూర అన్నంలోకే కాదు చపాతీ, పరోటాల్లోకి కూడా అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్లో టేస్టీ మామిడికాయ మటన్ కర్రీ చేసుకోని హాయిగా తినేయండి.