Jailed Before Elections : ఎన్నికల వేళ దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. "ఎన్నికల వేళ యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరినీ మనం కటకటాల వెనక్కి నెట్టడం ప్రారంభిస్తే, ఎంతమందికి జైలు శిక్ష పడుతుందో ఆలోచించండి?" అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2021లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్న యూట్యూబర్ దురైమురుగన్ సత్తాయికి బెయిల్‌ను పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అతడికి భారీ ఊరట లభించినట్లయింది.
దురైమురుగన్ బెయిల్‌ను రద్దు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. నిందితుడు దురైమురుగన్ నిరసన వ్యక్తం చేయడం, అభిప్రాయాలు వ్యక్తం చేయడం అనేది స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం కిందకు రాదని న్యాయస్థానం పేర్కొంది. బెయిల్‌పై ఉండే సమయంలో అసభ్య వ్యాఖ్యలు చేయకూడదని అతడికి షరతులు విధించాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
గతంలో బెయిల్ ఇలా రద్దు
వాస్తవానికి ఈ కేసులో గతంలోనే మద్రాసు హైకోర్టు నుంచి దురైమురుగన్‌కు బెయిల్ వచ్చింది. అయితే అప్పట్లో బెయిల్ ఇస్తున్న వేళ కోర్టు కొన్ని షరతులు విధించింది. సీఎం స్టాలిన్‌పై విమర్శలు చేయొద్దని స్పష్టం చేసింది. అయితే బెయిల్‌పై విడుదలయ్యాక దురైమురుగన్ సత్తాయి, సీఎంను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం మొదలుపెట్టారు. విమర్శనాత్మక కామెంట్లతో చేసిన వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ కూడా చేశారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం వెంటనే మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా దురైమురుగన్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దురైమురుగన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన దేశ సర్వోన్నత న్యాయస్థానం తాజా తీర్పును వెలువరించింది.
యూట్యూబ్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
గతంలో దురైమురుగన్ బెయిల్‌ను రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "మానవజాతి సంక్షేమం కోసమే శాస్త్రీయ ఆవిష్కరణలు జరిగాయి. ఇంటర్నెట్ చాలా మంది జీవితాలను మార్చిన అద్భుతమైన ఆవిష్కరణ. సామాన్య మనిషి కూడా తన రోజువారీ కార్యకలాపాలు, నైపుణ్యాలు, ఆలోచనలు, ప్రయాణ అనుభవాలను యూట్యూబ్‌లో ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాడు. యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన వీడియోలను చూసి చాలా ఇళ్లలో వంటలు వండుకుంటున్నారు. సోషల్ మీడియా జనాల మదిని ఎంతగా దోచుకుందో దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు" అని మద్రాస్ హైకోర్టు పేర్కొంది.