Hooch Tragedy In Tamil Nadu : తమిళనాడులోని కళ్లకురిచ్చిలో కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 33కు చేరింది. మరో 60 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. అందులో దాదాపు 20మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలు కావడం గమనార్హం. మంగళవారం రాత్రి పట్టణంలోని స్థానిక కరుణాపురంలో ఓ వ్యాపారి వద్ద కల్తీ మద్యం ప్యాకెట్లు కొనుగోలు చేశారు. ఆ కల్తీ మద్యం తాగిన తర్వాత, అందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తలనొప్పి, వాంతులు, వికారం, కడుపు నొప్పి, కళ్ల మంటలు వంటి లక్షణాలు ఎదుర్కొన్నారు. వెంటనే బాధితులను కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రకి, కళ్లకురిచ్చి బోధనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 10మంది మృతి చెందారు. తరువాత మృతుల సంఖ్య 33చేరింది.
కల్తీ మద్యంలో విషపదార్థం!
కల్తీ మద్యం తాగి 60 మందికిపైగా ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేరారు. 10 మందికి పైగా మెరుగైన వైద్యం అవసరమని పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)కు తరలించారు. రక్త నమూనాలను సేకరించి విల్లుపురం, జిప్మర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపించారు. ల్యాబ్ టెస్టుల్లో మద్యంలో మిథనాల్ అనే విషపదార్థం కలిపినట్లు తేలింది.
గవర్నర్ దిగ్భ్రాంతి
ఈ ఘటనపై తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.'కల్తీ మద్యం సేవించి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిసి చాలా బాధ పడ్డాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇంకా చాలా మంది ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అని ఎక్స్ వేదికగా స్పందించారు.
అధికారులపై స్టాలిన్ కఠిన చర్యలు
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ వేగంగా స్పందించారు. కేసును క్షుణ్ణంగా విచారించాలని క్రైమ్ బ్రాంచ్- క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం(సీబీసీఐడీ)ని స్టాలిన్ ఆదేశించారు. కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ శ్రవణ్ కుమార్ జాదావత్‌ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎంఎస్ ప్రసాద్‌ను నియమించారు. జిల్లా ఎస్పీ సమై సింగ్ మీనాని కూడా తొలగించి, రజత్ చతుర్వేదికి బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా, జిల్లా ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్‌కు చెందిన డీఎస్సీ తమిళ్ సెల్వన్ నేతృత్వంలోని టీమ్‌ను సస్పెండ్ చేశారు. మంత్రులు ఇ.వి.వేలు, ఎం.సుబ్రమణ్యం కళ్లకురిచ్చి ఆస్పత్రిని సందర్శించారు.