Railway Ticket Booking Rules Change : టికెట్ల రిజర్వేషన్ ముందస్తు బుకింగ్ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తున్నట్లు తీసుకున్న నిర్ణయంపై భారతీయ రైల్వే బోర్డు వివరణ ఇచ్చింది. గడువు ఎక్కువగా ఉండటం వల్ల అధిక సంఖ్యలో క్యాన్సిలేషన్లు అవుతున్నాయని తెలిపింది. దీంతో బెర్తులు వృథా అవుతున్నట్లు పేర్కొంది. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది.
"120రోజుల గడువు ఉండటం వల్ల క్యాన్సిలేషన్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇది ప్రస్తుతం 21శాతంగా ఉంటోంది. 4-5శాతం మంది ప్రయాణమే చేయడం లేదు. వారు టికెట్ రద్దు చేసుకోకపోవడం వల్ల సీట్లు/బెర్తులు వృథాగా పోతున్నాయి. ఇది పలు రకాల మోసాలు, రైల్వే అధికారులు అక్రమంగా డబ్బులు తీసుకోవడం వంటి ఘటనలకు కారణమవుతోంది. ప్రస్తుత నిర్ణయంతో వీటిని నిరోధించవచ్చు"
- రైల్వే బోర్డు
వీటితోపాటు గడువు ఎక్కువగా ఉండటం వల్ల కొంత మంది ముందస్తుగానే సీట్లను బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటోందని, తక్కువ గడువు ఉంటే నిజమైన ప్రయాణికులను అనువుగా ఉంటుందని తెలిపింది. తక్కువ క్యాన్సిలేషన్లు, ప్రయాణికుల డిమాండ్ అధికంగా కనిపిస్తే అందుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖకు వీలు ఉంటుందని పేర్కొంది. ముందస్తు బుకింగ్ గడువులో కాలానుగుణంగా మార్పులు జరుగుతూనే ఉన్నాయని రైల్వే బోర్డు వెల్లడించింది. ఇది 30రోజుల నుంచి 120 రోజుల వరకు ఉందని, వివిధ వ్యవధుల అనుభవాల ఆధారంగా, 60 రోజుల గడువు ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తించామని తెలిపింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 1981 నుంచి 2015 వరకు అనేకసార్లు మార్పులు చేసిన విషయాన్ని రైల్వే బోర్డు గుర్తుచేసింది.
టికెట్ రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ రైల్వే ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రయాణానికి 120 రోజుల ముందుగానే బుకింగ్ చేసుకునే సదుపాయం ఉండగా దానిని 60 రోజులకు కుదించింది. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ నిబంధనల్లో మార్పులు చేసింది. 2024 నవంబర్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. అయితే ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. కొత్త నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నప్పటికీ అక్టోబర్ 31 వరకు బుకింగ్ చేసుకునే వారికి పాత నిబంధన వర్తిస్తుంది. తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్ల బుకింగ్‌లో ఎటువంటి మార్పూ లేదు. ఇప్పటికే వాటిలో బుకింగ్ వ్యవధి తక్కువగా ఉంది. ఇక విదేశీ పర్యటకులు మాత్రం 365 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా ఇందులోనూ ఎలాంటి మార్పూ లేదు.