Hand Transplant In Delhi : అవయదానం ఎంతోమంది బాధితుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. కళ్లు, కిడ్నీ, గుండె దానాల గురించి మనం చాలా సార్లు వినే ఉంటాం. కానీ, రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి వాటిని అమర్చి పునర్జన్మ అందించింది దిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యబృందం. దీంతో అతడి జీవితంలో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి.
2020లో జరిగిన రైలు ప్రమాదంలో దిల్లీకి చెందిన ఓ 45 ఏళ్ల వ్యక్తి తన రెండు చేతులను కోల్పోయాడు. దీంతో తన చేతులను తిరిగి పొందేందుకు వైద్యులను ఆశ్రయించాడు. ఇటీవలే బ్రెయిన్ డెడ్‌తో మరణించిన మహిళ చేతులను అతడికి విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు వైద్యులు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చేతులను, వేళ్లను కదిలించగలుగుతున్నాడని వెల్లడించారు. భవిష్యత్తులో రక్త సరఫరా సైతం సాఫీగా జరుగుతుందని చెప్పారు. డాక్టర్ నిఖిల్ ఝున్‌ఝున్‌వాలా నేతృత్వంలోని వైద్యుల బృందం, సుమారు 12 గంటలు శ్రమించి ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశామని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామన్నారు.
"ఓ రైలు ప్రమాదంలో బాధితుడు రెండు చేతులు కోల్పోయాడు. దీంతో అప్పుడు అతడికి ఆపరేషన్ చేసి రెండు చేతుల చివరలను మూసివేశారు. తాజాగా మరో శస్త్రచికిత్స చేసి వాటిని తెరిచి, కొత్త చేతులకు అతికించాం. ఆపరేషన్ చేసేటప్పుడు కత్తిరించిన నరాలు, ఎముకలను ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా తిరిగి అనుసంధానం చేశాం. అతడి నరాలు తిరిగి అతుక్కునేందుకు మరికొంత సమయం పడుతుంది. ప్రస్తుతం అతడు మోచేతిని కదిలిస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత చేతులు, మణికట్టును కదపడానికి వీలవుతుంది. నొప్పి, వేడి లాంటి స్పర్శలను తెలుసుకునేందుకు సుమారు ఏడు నెలల సమయం పడుతుంది."
-- సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు
"మరొకరిపై ఆధారపడి జీవించాలని నాకు లేదు. అందుకే ప్రమాదమని తెలిసినా ఆపరేషన్ చేసుకునేందుకు సిద్ధమయ్యాను. తిరిగి సాధారణ జీవితాన్ని గడపడమే నా లక్ష్యం. కష్ట సమయంలో నా భార్య నాకు అండగా నిలిచింది. నా కుమారుడు పని చేస్తూ కుటుంబ బాధ్యతలను భూజాన వేసుకున్నాడు. నాకు చేతులు దానం చేసిన మహిళకు, ఆమె కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటాను. నాకు పునర్జన్మ ఇచ్చిన వైద్యులకు ధన్యవాదాలు."
--రాజ్‌కుమార్, బాధితుడు
మరోవైపు దిల్లీకి చెందిన ఓ వృద్ధురాలు బ్రెయిన్ డెడ్ కావడం వల్ల ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. ఆమె అవయవాలతో మరో ముగ్గురికి కొత్త జీవితం ప్రసాదించారు. ఆమె రెండు కిడ్నీలతో పాటు లివర్, కళ్లను మరొకరికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.