Gyanvapi ASI Report : ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయానికి సంబంధించి ఏఎస్‌ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) సర్వే రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్ఞానవాపి మసీదు కింద అతి పెద్ద ఆలయం ఆనవాళ్లను గుర్తించినట్లు ఏఎస్‌ఐ సర్వేలో వెల్లడైందని హిందూపక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ తెలిపారు. నిర్మాణం కింద 34 శాసనాలను ఏఎస్‌ఐ సర్వేలో గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా 32 ముద్రికలను కూడా ఏఎస్‌ఐ సర్వేలో భాగంగా కనుగొన్నట్లు విష్ణుశంకర్ వివరించారు.
నిర్మాణ సమయంలోనూ శాసనాలు వాడినట్లు సర్వేలో వెల్లడైందని ఆయన ప్రస్తావించారు. తెలుగు సహా దేవనాగరి, గ్రంథ, కన్నడ భాషల్లో శాసనాలున్నట్లు న్యాయవాది విష్ణుశంకర్ చెప్పారు. గతంలో ధ్వంసమైన నిర్మాణ భాగాలు మళ్లీ వాడినట్లు సర్వేలో బయటపడిందని ఆయన అన్నారు. శాసనాలపై జనార్దన, రుద్ర, ఉమేశ్వర దేవతల పేర్లనూ ఏఎస్‌ఐ నిర్వహించిన సర్వేలో గుర్తించినట్లు విష్ణుశంకర్ తెలిపారు.
"పురావస్తుశాఖ నివేదిక 839 పేజీలతో ఉంది. దానిని ఈ కేసులో భాగస్వాములుగా ఉన్న వారికి గురువారం సాయంత్రం కోర్టు అందించింది. ఆలయ అవశేషాలపైనే మసీదు నిర్మించినట్లు అందులో స్పష్టంగా ఉంది. సర్వే నివేదికలో ఆలయానికి సంబంధించిన తగినన్ని సాక్ష్యాధారాలున్నాయి" అని హిందూపక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ మీడియాకు తెలిపారు.
Gyanvapi Case Court Verdict : జ్ఞానవాపి మసీదు స్థానంలో గతంలో ఉన్న ఆలయాన్ని పునరుద్దరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్ కొట్టివేయాలని దాఖలు చేసిన 5 పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు ఇటీవలే తోసిపుచ్చింది. 1991లో వారణాసి కోర్టులో దాఖలైన పిటిషన్ అనుమతించతగినదే అని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ తీర్పు ఇచ్చారు. వారణాసి కోర్టులో ఉన్న పిటిషన్‌ను ప్రార్థనా స్థలాల చట్టం-1991 నిరోధించలేదని స్పష్టంచేశారు.
జ్ఞానవాపి మసీదు ఒకప్పుడు కాశీ విశ్వనాథ్ ఆలయంలో భాగమేనని అక్కడ మసీదు నిర్మించారని కాబట్టి మళ్లీ ఆలయం పునరుద్దరించాలని హిందువులు వారణాసి కోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన వారణాసి కోర్టు 2021 ఏప్రిల్ 8న జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ మసీదు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ-AIMC, ఉత్తర్‌ప్రదేశ్ సున్నీ సెంటర్ల్ వక్ఫ్ బోర్డ్ హైకోర్టులో 5 పిటిషన్లు దాఖలు చేశాయి. విచారణ జరిపిన అలాహాబాద్ హైకోర్టు ఐదు పిటిషన్లను కొట్టి వేసింది. మసీదు స్థానంలో ఆలయం పునరుద్దరించాలని దాఖలైన పిటిషన్లపై ఆరు నెలల్లో విచారణ పూర్తిచేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది.