Government House To Padma Shri Chinnapillai : మహిళా దినోత్సవం సందర్భంగా ఈటీవీ భారత్ అందించిన కథనంతో తమిళనాడుకు చెందిన పద్మశ్రీ, నారీశక్తి పురస్కారాల గ్రహీత 72 ఏళ్ల చిన్నపిళ్లై సమస్య తీరింది! నివసించేందుకు ఇల్లు లేక బాధపడుతున్న ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నివాసాన్ని నిర్మించి అందించనుంది. త్వరలోనే ఈ ఇల్లు నిర్మాణం ప్రారంభం కానుంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సొంతింటి కోసం దరఖాస్తు చేసుకుని మూడేళ్ల గడుస్తున్నా చిన్నపిళ్లై లబ్ది పొందలేదు. దీంతో ఇదే విషయాన్ని ఇటీవలే ఈటీవీ భారత్కు తెలిపింది. మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా తనకు ఇల్లు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ఈటీవీ భారత్ ఆమె ఇబ్బందులపై కథనం ప్రచురించింది.
ఈటీవీ భారత్ కథనానికి తమిళనాడు ప్రభుత్వం తాజాగా స్పందించింది. 'కళైంజ్ఞర్ డ్రీమ్ హౌస్' పథకం కింద చిన్నపిళ్లైకి వెంటనే ఇల్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశించారు. "మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయా చేతుల మీదుగా 2000లో నారీ శక్తి పురస్కారం పొందిన మధురై జిల్లాకు చెందిన పద్మశ్రీ చిన్నపిళ్లైకి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు కాకపోవడంపై ఆమె నిరాశ వ్యక్తం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సర్కార్ ఆమెకు కొత్తి ఇంటిని నిర్మించి అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు" అని సీఎంవో కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
చిన్నపిళ్లైకి పిల్లుచ్చేరి పంచాయతీ పార్థివపట్టి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిన ఒక సెంటు ఇంటి స్థలంతో పాటు మరో 380 చదరపు అడుగుల స్థలాన్ని స్టాలిన్ సర్కార్ ఇవ్వనుంది. అంతేకాకుండా కలైంజ్ఞర్ డ్రీమ్ హౌస్ పథకం కింద ఆమెకు కొత్త ఇంటిని నిర్మించి అందించనుంది. ఈ నెలలోనే ఆ ఇంటి నిర్మాణం మొదలవ్వనుంది.
అయితే సీఎంవో ప్రకటన అనంతరం ఈటీవీ భారత్ తమిళనాడుకు ధన్యవాదాలు తెలిపారు చిన్నపిళ్లై. దేశవ్యాప్తంగా మద్యపానాన్ని నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్- వందల కి.మీ. నడిచిన ఆ కూలీ క్షేమంగా ఇంటికి..