Goods Train Without Driver Incident : డ్రైవర్ లేకుండా అత్యంత ప్రమాదకరంగా గూడ్స్ రైలు ప్రయాణించిన ఘటన లోకోపైలట్, స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యం వల్లే జరిగినట్లు రైల్వే ఉన్నతాధికారులు తేల్చారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురిని విచారించిన తర్వాత అధికారులు నివేదిక రూపొందించారు.
పొరపాటు జరిగింది అక్కడే
కథువా స్టేషన్‌లో రైలు ఇంజిన్, 3 వ్యాగన్లను ఆపేందుకు హ్యాండ్ బ్రేకులను అప్లై చేశానని, రైలు ముందుకు కదలకుండా చెక్కదుంగలను కూడా ట్రాకులపై అడ్డుపెట్టానని లోకోపైలట్ వాంగ్మూలం ఇచ్చాడు. అయితే ఉచ్చిబస్సి స్టేషన్‌లో రైలు ఆగిన తర్వాత తనిఖీ చేసిన అక్కడి స్టేషన్‌మాస్టర్, హ్యాండ్‌బ్రేకులు వేయలేదని గుర్తించారు. కథువా స్టేషన్‌మాస్టర్ కూడా రైలు ఆగిన తర్వాత బ్రేకులు వేశారో లేదో నిర్ధరించకుండా రైల్వే నిబంధనలను ఉల్లఘించారని నివేదిక పేర్కొంది.
ఆరుగురిపై వేటు
కథువా స్టేషన్‌లో నిలిపిన రైలుకు బ్రేక్ వ్యాన్ లేదు. జమ్ము స్టేషన్‌కు రైలును నడపమని కంట్రోల్ రూం తెలిపిన తర్వాత గార్డు కోచ్ లేదా బ్రేక్ వ్యాన్ లేదని లోకోపైలట్ జవాబు ఇచ్చాడు. దీంతో చేసేదేం లేక రైలును అక్కడే వదిలి విధుల నుంచి విరామం తీసుకోమని కంట్రోల్‌రూం తెలిపింది. తాళం స్టేషన్‌మాస్టర్‌కు అందించి డ్రైవర్ వెళ్లిపోయాడు. అయితే ఈ క్రమంలో రిజిస్టర్‌లో సమాచారాన్ని పేర్కొనలేదు. సంతకమూ చేయలేదు. రైలును మనిషి లేకుండా నిలిపి ఉంచే సమయంలో రైల్వే నిబంధనల ప్రకారం స్టేషన్‌మాస్టర్ లిఖిత పూర్వకంగా లోకోపైలట్‌కు అనుమతి రాసి ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఇక్కడ జరగలేదు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అనంతరం ఆరుగురు రైల్వే సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు.
వంద స్పీడులో రైలు
రైల్వే నిర్మాణ సామాగ్రిని తరలించే గూడ్సు రైలు కథువా నుంచి ఉచ్చిబస్సు స్టేషన్ వరకు దాదాపు 75 కిలోమీటర్లు లోకోపైలట్, అసిస్టెంట్ లోకోపైలట్ లేకుండా ప్రయాణించింది. ఒకానొక సమయంలో రైలు వేగం గంటకు 100 కిలోమీటర్లు చేరినట్లు అధికారులు నిర్ధరించారు. ఇంజిన్ ప్రారంభం కాకుండా కేవలం జారుడుగా ఉన్న పట్టాలపై రైలు ముందుకు కదులుతూ వెళ్లింది. మార్గమధ్యలో 8 నుంచి 9 స్టేషన్‌లను అది దాటింది. అదృష్టవశాత్తూ ఎదురుగా వేరే రైళ్లు రాకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. చివరకు ఉచ్చిబస్సు స్టేషన్‌వద్ద రైల్వే అధికారులు ఇసుకబస్తాలు అడ్డుపెట్టి రైలును ఆపగలిగారు.
కశ్మీర్ టు పంజాబ్- డ్రైవర్ లేకుండా 78కి.మీ దూసుకెళ్లిన రైలు- టెన్షన్ టెన్షన్!
పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. 8 రైళ్లు రద్దు.. సహాయక చర్యలు ముమ్మరం