Good News for Tirupati Local People: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. నిత్యం వేలాది భక్తులు కాలి నడక మార్గం ద్వారా ఏడుకొండలు ఎక్కి తమ మొక్కులను, ముడుపులను చెల్లించుకుంటారు. వేలసంఖ్యలో ఆ ఏడుకొండల వాడికి తలనీలాలు సమర్పిస్తారు. మరికొద్దిమంది బంగారం, డబ్బులు, ఫోన్లు, వాచీలను హూండీలో వేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు.
అయితే ఏడుకొండల వాడిని దర్శించుకోవాలంటే దర్శనం టికెట్లు మాత్రమే కాకుండా ట్రైన్, రూమ్ ఇలా అన్నింటిని వేరువేరుగా బుక్ చేసుకోవడం కాస్త ఇబ్బందితో కూడుకున్న అంశం. ఎటు లేదన్నా తిరుమల వెళ్లాలనుకుంటే నెల ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఇవేమి లేకుండా నేరుగా స్వామి వారి దర్శనం ఉంటే? నిజమే మీరు విన్నది. తిరుమల స్థానికులు అలాంటి అవకాశాన్నే పొందనున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రతి మంగళవారం దర్శనం: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఏర్పాటైన తర్వాత తిరుమల స్థానికులకు ప్రతి మంగళవారం శ్రీవారి దర్శనం ఉంటుందని తిరుపతి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. త్వరలోనే దీనిపై నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్లినట్లు ఎమ్మెల్యే ఆరణి తెలిపారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వస్తుందని.. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా వెల్లడించనున్నట్లు తెలిపారు. అలాగే శ్రీవాణి, దర్శనాల అవినీతిపై విజిలెన్స్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. తిరుమలలో చిరు దుకాణాదారుల సమస్యలపై ఈవోతో చర్చిస్తానని ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు.
తిరుమల లడ్డూ ధరలపై కీలక ప్రకటన: తిరుమల లడ్డూ ధర తగ్గించారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. లడ్డూ ధర రూ.50 నుంచి రూ.25కి తగ్గించారని, అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రూ.200 తగ్గించారంటూ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వార్తలపై టీటీడీ స్పందించింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుమల లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీటీడీ ధరలను సవరించిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని స్పష్టం చేసింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం.. రూ. 50 లడ్డూ ధరల్లో ఎలాంటి మార్పు లేదని టీటీడీ తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నమ్మవద్దని స్పష్టం చేసింది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం దళారులను నమ్మి మోసపోవద్దని సూచించింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అధిక ధరలకు పొందవచ్చని వాట్సప్ గ్రూపులలో ప్రచారం జరుగుతోందన్న టీటీడీ.. ఇదంతా అవాస్తమని తెలిపింది.