Gali Janardhan Reddy Joining BJP : కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత గూటికి వెళ్లనున్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన సోమవారం మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నేతల సమక్షంలో పార్టీలోకి చేరనున్నట్టు తెలిపారు. బీజేపీ తమ రక్తంలో ఉందన్నారు. ఇప్పుడు సొంత(మాతృ) పార్టీలోకి తిరిగి వస్తున్నట్లు చెప్పారు. అయితే ఒకానొక సమయంలో బీజేపీకి బయట నుంచి మద్దతు ఇచ్చే ప్రశ్న తలెత్తిందని, కానీ తన పార్టీ కార్యకర్తలు విలీనానికి ఓటు వేశారని చెప్పారు. ఇక బీజేపీ తమ రక్తంలోనే ఉందని పేర్కొన్నారు. మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేందుకు తాను మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ పార్టీలో చేరి సాధరణ కార్యకర్తగా పని చేస్తానన్నారు.
2022లో జనార్దన్ రెడ్డి స్థాపించిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేర్పీపీ)ని బీజేపీలో విలీనం చేయడానికి, పార్టీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. జనార్దన్ రెడ్డితో పాటు కేఆర్పీపీ నేతలంతా బీజేపీ కండువా కప్పుకోనున్నారు.
పార్టీ విలీన విషయమై జనార్దన్ రెడ్డి ఇటీవల దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు. తాజాగా తన పార్టీ మద్దతుదారులతో, కేఆర్పీపీ భవిష్యత్తుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పార్టీని బీజేపీలో విలీనం చేయాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశం అనంతరం జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
" పార్టీలో చేరాలని బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. సోమవారం విజయేంద్ర సమక్షంలో బీజేపీలో చేరబోతున్నాను. చిత్రదుర్గ, గుల్బర్గా, కొప్పల్, రాయచూర్, బళ్లారి, విజయనగరం నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు నా నిర్ణయానికి మద్దతు తెలిపారు. బీజేపీలో పార్టీని విలీనం చేసేందుకు అందరూ అంగీకరించారు."
-- గాలి జనార్దన్ రెడ్డి, కర్ణాటక మాజీ మంత్రి
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటు కాంగ్రెస్‌కు వేశారు జనార్దన్ రెడ్డి. అయితే అది తన మనస్సాక్షి ఓటని తాజాగా సమర్థించుకున్నారు. ఇక మాజీ మంత్రి శ్రీరాములుతో తనకు విభేదాలేం లేవన్నారు. ఆయన్ను చిన్నప్పటి నుంచి తాను పెంచినట్లు తెలిపారు. బళ్లారి లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములుకు మద్దతిస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరాములు ఓడిపోయారు.
బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత బీజేపీకి క్రమంగా దూరమయ్యారు. అనంతరం 2022లో కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించారు. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య అరుణ లక్ష్మిని, తన సోదరుడు, బీజేపీ అభ్యర్థి సోమశేఖర రెడ్డిపై పోటీకి దింపారు. ఫలితంగా ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి గెలుపొందారు. బీజేపీ టికెట్‌పై బరిలోకి దిగిన మరో సోదరుడు కరుణాకర రెడ్డి ఓటమిలో కూడా కీలక పాత్ర పోషించారు జనార్దన్ రెడ్డి.
ఆరు భాషల్లో అశ్విని రాజకీయం- బీజేపీ ఎంపీ అభ్యర్థిగా స్కూల్ టీచర్ - BJP Multi Lingual Candidate
దిల్లీలో ఇండియా కూటమి మహా ర్యాలీ- ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయం! - INDIA Alliance on Kejriwal Arrest