Gaganyaan Mission Backup Sites : భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి మూడు రోజుల తర్వాత భూమి మీదకు వస్తారు. ఈ క్రమంలో వారి సురక్షిత ల్యాండింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా 48 బ్యాకప్ సైట్లను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గుర్తించింది. గగన్‌యాన్ యాత్రలో భాగంగా వ్యోమగాములతో కూడిన మాడ్యూల్ అరేబియా సముద్రంలో దిగాల్సి ఉంది. వారిని రక్షించేందుకు అక్కడ సిబ్బంది సిద్ధంగా ఉంటారు. ఐతే ఈ ప్రణాళికలో ఏ చిన్న మార్పుకైనా సిద్ధంగా ఉండే దిశగా ఇస్రో చర్యలు తీసుకుంటోంది.
'48 బ్యాకప్ సైట్లు గుర్తించాం'
మిషన్‌లో చిన్నపాటి వేరియేషన్ కూడా వందల కిలోమీటర్ల దూరంలో ల్యాండింగ్‌కు కారణమవుతుందని ఇస్రో అధికారులు చెప్పారు. అందుకే అంతర్జాతీయ జలాల్లో 48 బ్యాకప్ సైట్లను గుర్తించారు. అంతా అనుకున్నట్టే జరిగితే ఆ మాడ్యూల్ భారత జలాల్లో దిగుతుందని తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములను తిరిగి తీసుకువచ్చే విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేమని, అందుకే ల్యాండింగ్‌కు అవకాశం ఉన్న పాయింట్లను గుర్తించినట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం గగన్‌యాన్ పనుల్లో పురోగతి ఆశాజనకంగా ఉందన్నారు. ఈ ఏడాది కనీసం ఒక్క మానవ రహిత యాత్ర అయినా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
గగన్‌యాన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాములు
గగన్‌యాన్‌కు ఎంపికైన వ్యోమగాముల పేర్లను ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లనున్నారు. భారత నేల నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు.
వారి భాగస్వామ్యం లేనిదే!
21వ శతాబ్దంలో భారత్ ప్రపంచస్థాయి దేశంగా అవతరిస్తోందని ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం తెలిపారు. అన్ని రంగాల్లో పురోగమిస్తోందని పేర్కొన్నారు. చంద్రయాన్, గగన్‌యాన్ వంటి ప్రాజెక్టుల్లో మహిళల పాత్ర ఎనలేనిదని మోదీ కొనియాడారు. వారి భాగస్వామ్యం లేనిదే ఈ ప్రాజెక్టులు సాధ్యమయ్యేవి కాదని అన్నారు. గగన్‌యాన్ మిషన్‌లో చాలా వరకు భారత్‌లో తయారైన పరికరాలను ఉపయోగించడం గర్వకారణమని చెప్పారు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌కు క్యాన్సర్ - 'సరిగ్గా ఆదిత్య ప్రయోగం రోజే తెలిసింది'
గగన్‌యాన్‌కు 'టీమ్ భారత్' సిద్ధం - ఈ మిషన్‌తో దేశం, మానవాళికి కలిగే మేలేంటి?