Kolkata Doctor Case : బంగాల్లో వైద్యరాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు జరగుతున్న సమయంలో కోల్‌కతాలో అరుదైన పరిణామం జరిగింది. ఫుట్‌బాల్‌లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న రెండు గ్రూపులు ఏకతాటిపైకి వచ్చాయి. డాక్టర్ మృతికి నిరసనగా భారీ ర్యాలీ చేపట్టాయి.
ఫుట్‌బాల్‌లో చిరకాల ప్రత్యర్థులుగా పేరొందిన ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ క్లబ్‌లు ఒక్కతాటిపైకి వచ్చాయి. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ఫుట్‌బాల్ క్లబ్‌లుగా ఈ బృందాలు ప్రసిద్ధి చెందాయి. ఈ గ్రూప్‌లకు చెందిన వందలాది మంది మద్దతుదారులు సాల్ట్ లేక్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. వైద్య విద్యార్థిని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. మరో ఫుట్‌బాల్ క్లబ్ మద్దతుదారులు సైతం ఈ ఆందోళనలో వచ్చి చేరారు. ఇలా మూడు క్లబ్‌ల అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడం వల్ల అప్రమత్తమైన పోలీసులు పెద్దఎత్తున బలగాలను రంగంలోకి దించారు. ఆందోళన కారులను నిలువరించేందుకు యత్నించినప్పటికీ, వారు ముందుకు సాగారు. ఇదే సమయంలో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కల్యాణ్ చౌబే ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
This is the 1st time in the History more then 60,000 supporters of Mohun Bagan & East Bengal football club came together & demanding justice for the doctor of #RGKarHospital. The police even Lathi Charge the supporters but failed. Lets fight for Justice✊🏻#KolkataDoctorDeathCase pic.twitter.com/jg9KfWsk3x
— Priyanka Sharma 🇮🇳 (@Priyankabjym) August 18, 2024
కోల్‌కతా ఫుట్‌బాల్ పోటీలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. వీటిలో ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ జట్లకు వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. వీటి మధ్య పోటీ మ్యాచ్‌లను తిలకించేందుకు అభిమానులు వేలసంఖ్యలో తరలివస్తుంటారు. ఆసియాలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ పోటీల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల దృష్ట్యా జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసినట్లు పోలీసులు ప్రకటించారు.
'మమతా బెనర్జీపై విశ్వాసం పోయింది'
తమ కుమార్తె విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని వైద్య విద్యార్థిని తండ్రి ఆరోపించారు. ఈ ఘటనతో సీఎం మమతా బెనర్జీపై విశ్వాసం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, ఇంతకు ముందు బెంగాల్ ముఖ్యమంత్రిపై పూర్తి విశ్వాసం ఉండేదని తెలిపారు. కానీ ఈ ఘటన జరిగిన తరువాత ఆ విశ్వాసం లేదన్నారు. న్యాయం జరగాలని మమతా చెబుతోంది. కానీ, దాని కోసం ఆమె ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. తన కుమార్తె డైరీలోని ఒక పేజీని సీబీఐకి అందజేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.