Assam Floods Death Toll : అసోంలో వరద బీభత్సం అంతకంతకూ పెరుగుతోంది. బుధవారం మరో 8మంది మృతిచెందగా, 27జిల్లాల పరిధిలోని 16.25 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన చేశారు. సోనిత్‌పుర్ జిల్లా తేజ్‌పుర్‌లో ఇద్దరు, మోరిగావ్, దిబ్రుగఢ్, దరాంగ్, గోలాఘాట్, బిస్వనాథ్, తిన్‌సుకియా ప్రాంతాల్లో ఒక్కొక్కరు మృతి చెందినట్లు చెప్పారు. 24జిల్లాల పరిధిలోని 515 వరద సహాయక శిబిరాల్లో దాదాపు 4లక్షల మంది తలదాచుకుంటున్నారు. 8,400 మందిని సహాయక బృందాలు కాపాడినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 2,800 గ్రామాలు వరదగుప్పిట్లో చిక్కుకోగా, 42,478 హెక్టార్లలో వివిధరకాల పంటలు నీట మునిగినట్లు తెలిపారు. వరదల కారణంగా పలు జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతినట్లు చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అసోంలో సంభవించిన ప్రకృతి విపత్తుల్లో చనిపోయినవారి సంఖ్య 56కు చేరినట్లు అధికారులు తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పర్యటించారు. ఖానా నదిపై నిర్మించిన ధారాపుర్ జంగ్రాబార్ డ్యామ్‌లో దెబ్బతిన్న స్లూయూస్ గేట్‌ను పరిశీలించారు. పలు ప్రాంతాలలో దెబ్బతిన్న రోడ్లు, ఆనకట్టల మరమ్మతుల పనులను త్వరగతిన పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. రెండో విడత వరదలకు అరుణాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్టే కారణమని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. చైనా, భూటాన్ నుంచి కూడా వరద వస్తోందని చెప్పారు. కామ్రూప్ జిల్లాలో వరద పరిస్థితిపై సమీక్షించిన ఆయన, ఎన్డీఆర్‌ఆఫ్ బృందాలు 24 గంటలు సహాయ చర్యలు చేపడుతున్నాయనని వెల్లడించారు.
వన్యప్రాణులు మృతి
మరోవైపు భారీ వర్షాలకు కజిరంగ జాతీయ పార్కు, టైగర్ రిజర్వ్ కేంద్రాలు వరద నీటిలో మునిగిపోయాయని అటవీ అధికారులు తెలిపారు. 233 అటవీ శిబిరాల్లో 178 చోట్ల ఐదు అడుగుల మేర నీరు ప్రవహిస్తోందని వెల్లడించారు. ముంపునకు గురైన శిబిరాల్లో 80 అగ్రాటోలి, కజిరంగ ప్రాంతాలలో ఉన్నాయని తెలిపారు. వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుండటం వల్ల తొమ్మిది శిబిరాల్లో ఉన్న ఫారెస్టు గార్డులు వెనక్కి వచ్చేశారని అధికారులు చెప్పారు. వరద నీటిలో మునిగి ఒక ఖడ్గమృగం సహా ఎనిమిది జంతువులు మృతి చెందాయని వెల్లడించారు. మరో 44 జంతువులను కాపాడినట్లు వివరించారు. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సమీక్ష నిర్వహించారు. పార్కులోని జంతువులను రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. గాయాల పాలైన జంతువులకు చికిత్స చేసేందుకు మెుబైల్ వెటర్నరీ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయాలని అటవీ అధికారులకు సూచించారు.
రాహుల్ గాంధీ ఇంటి వద్ద హై సెక్యూరిటీ- నిఘా వర్గాల హెచ్చరికతోనే!
ఆడ్వాణీకి మళ్లీ అస్వస్థత- ఆస్పత్రికి తరలింపు- ఆరోగ్య సమస్య చెప్పని డాక్టర్లు