Firecracker Factory Blast In Madhya Pradesh : ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 11 మంది మృతి చెందారు. సుమారుగా 174 మంది గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో మంగళవారం జరిగింది. మరికొంత మంది కర్మాగారంలో చిక్కుకొని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఇందౌర్, భోపాల్ నుంచి ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నాయి.
ఈ ఘటన బైరగర్ పట్టణంలోని మగర్ధ రోడ్డులో అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా ప్యాక్టరీలో మంగళవారం ఉదయం 11:30 గంటల సమయంలో జరిగింది. పేలుడు అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ భారీ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, దుకాణాల కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయని స్థానికులు తెలిపారు. అలానే, పేలుడు తీవ్రతకు పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు వెల్లడించారు.
మృతుల కుటుంబాలకు పరిహారం
బాణసంచా పేలుడు ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధికారులను ఆరా తీశారు. అగ్నిప్రమాద బాధితులకు చికిత్స అందించేందుకు ఇందౌర్, భోపాల్‌లోని ఆస్పత్రులతో పాటు ఎయిమ్స్‌లో ఏర్పాట్లు చేయాలని సూచించారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. "ఘటనాస్థలికి 50 అంబులెన్స్‌లను పంపారు. మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్, హోంగార్డ్ డీజీ అరవింద్‌తో పాటు 400 మంది పోలీసు అధికారులు అక్కడి వెళ్లారు. మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తాం. క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స అందిస్తాం" అని సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు.
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాని అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని హర్దా జిల్లా కలెక్టర్ రిషి గార్గ్ తెలిపారు. 'ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హర్దా జిల్లా ఆసుపత్రికి తరలించాం. తీవ్రగాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం భోపాల్, ఇందౌర్లకు తరలించేదుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సమీప జిల్లా నుంచి అంబులెన్స్‌లు, వైద్యులు, ఎన్డీఆర్ఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఘటనా స్థలానికి పిలిపించాం' అని కలెక్టర్ రిషి గార్గ్ తెలిపారు.
200కార్లు, 250 బైక్‌లు దగ్ధం- ప్రమాదానికి అదే కారణమా?
ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం- నిద్రిస్తున్న ఆరుగురు కార్మికులు సజీవదహనం