Fire Accident In Wedding Ceremony : బిహార్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసలు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో మంటలను అదుపుచేశారు. బాణసంచా కాల్చడం వల్ల చెలరేగిన మంటలు వెంటనే సిలిండర్, డీజిల్ స్టాక్‌లోకి వ్యాపించినట్లు సమాచారం. అనంతరం భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
ఇదీ జరిగింది
బహెరా పోలీస్ స్టేషన్‌లోని ఆంటోర్ గ్రామంలో ఛగన్ పాశ్వాన్ కుమార్తె వివాహ వేడుక జరిగింది. వేడుక కోసం టెంట్ ఏర్పాటు చేసి, బస బోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం పెళ్లి ఊరేగింపు వచ్చింది. ఈ క్రమంలో భారీగా బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో టెంట్‌కు నిప్పు అంటుకుంది. దీంతో అక్కడే ఉంచిన సిలిండర్లు, డీజిల్‌కు మంటలు వ్యాపించి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మూడు పశువులు కూడా మరణించాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికులతో కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై దర్భంగా జిల్లా మేజిస్ట్రేట్ రాజీవ్ రోషన్ స్పందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు అన్వేషించడానికి ఒక బృందాన్ని కూడా ఘటనాస్థలికి పంపించామని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు- ముగ్గురు మృతి
రోడ్డు పక్కన నిద్రిస్తున్న 11మందిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరేళ్ల బాలిక సహా ముగ్గురు మృతి చెందారు. మిగతా ఎనిమిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో గురువారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహ్వా పట్టణంలోని ఓ మురికివాడలో బాధితులు నివసిస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల సమీపంలోని రోడ్డు పక్కన నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా ఓ కారు వారి పైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరేళ్ల బాలిక సహా ముగ్గురు మృతిచెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి వెళ్లి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిలో ప్రాథమిక చికిత్స తర్వాత ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారని, మరో ఆరుగురిని జైపుర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు మహ్వా ఎస్ఐ అజయ్ సింగ్ తెలిపారు. కారును స్వాధీనం చేసుకున్నామన్న అజయ్ సింగ్, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
'హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు'- లేబుల్ మార్చేసిన కంపెనీ - health drink brands in india