Nirmala Sitharaman Budget Speech 2024 : సబ్ కా సాత్, సబ్కా వికాస్, సబ్ కా విశ్వాస్ లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గత పదేళ్లలో మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేశాయన్నారు. కొత్త పారిశ్రామికవేత్తలు వెలుగులోకి వచ్చారని చెప్పారు.
'ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారు. మోదీ సర్కార్ అమలు చేసిన సమ్మిళిత, సంతులిత ఆర్థిక విధానాలు ఆర్థిక వ్యవస్థలో చిట్టచివరి వ్యక్తి వరకు అభివృద్ధిని తీసుకెళ్లాయి. ఇంటింటికి విద్యుత్, ఉపాధి, ప్రతి ఇంటికి తాగునీరు అనేవి సమ్మిళిత అభివృద్ధికి నిదర్శనం.'
-- నిర్మాలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
వ్యవసాయానికి పెద్దపీట
'కునారిల్లుతున్న వ్యవసాయ రంగానికి మోదీ ప్రభుత్వం కొత్త ఊపిరి ఊదింది. మద్దతు ధరలు, పెట్టుబడి రాయితీలతో రైతులకు పలు ప్రయోజనాలు కల్పించింది. సమాజంలోని అన్ని వర్గాల వారికి కుల, మత, ఆర్థిక బేధాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించే ప్రయత్నాలు చేస్తోంది' అని సీతరామన్ తెలిపారు.
అసమానతలు లేని భారత్
2047 నాటికి దేశంలో అసమానత, పేదరికం అనేది కనబడకుండా చేయాలన్నదే మోదీ సర్కార్ లక్ష్యమని నిర్మలా సీతారామన్ చెప్పారు. తమ ప్రభుత్వం ఆచరణీయమైన సెక్యులరిజం కోసం ప్రయత్నం చేస్తోందని అన్నారు. వారసత్వవాద వ్యతిరేకంగా పనిచేస్తోంది స్పష్టం చేశారు.
ఆ నాలుగు వర్గాలకే ప్రాధాన్యం
మోదీ సర్కార్ పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తిమంతం చేసే ప్రయత్నం చేస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలోని పేదరిక నిర్మూలనకు బహుముఖ విధానాలతో ఈ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. జన్‌ధన్ ఖాతాల ద్వారా రూ.34 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ చేశామన్న మంత్రి, 78 లక్షల మందికి వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. అలాగే రూ.2.20 లక్షల కోట్లను పూచీకత్తు లేని రుణాలు అందించామని చెప్పారు. విశ్వకర్మ యోజన ద్వారా చేతివృత్తుల వారికి ముడిసరుకుల నుంచి మార్కెటింగ్ వరకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇళ్లలో 70 శాతం వరకు మహిళలు లేదా మహిళల జాయింట్ ఓనర్‌షిప్‌కు ఇచ్చామని ఆర్థికమంత్రి తెలిపారు.
రైతులపై వరాల జల్లు
మోదీ సర్కార్ 11.8 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థికసాయం అందించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అలాగే 4.5 కోట్లమందికి బీమా సౌకర్యం కల్పించామన్నారు. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికత తీసుకొచ్చామని చెప్పారు.
యువత కోసం
యువత కోసం స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కోటి నలభై లక్షల మందికి నైపుణ్య శిక్షణతో ఉపాధి కల్పించామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మూడు వేల ఐటీఐలు, 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు కొత్తగా ప్రారంభించామని చెప్పారు. ముద్ర యోజన ద్వారా యువతకు రూ.25 లక్షల కోట్ల రుణాలను అందించామన్నారు. స్టార్టప్ ఇండియా ద్వారా యువతను కొత్త పారిశ్రామికులుగా తయారుచేశామన్నారు. అలాగే 30 కోట్ల మంది మహిళలకు ముద్ర రుణాలు అందించామని స్పష్టం చేశారు.
సవాళ్లు
ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం, దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇది ప్రపంచ వాణిజ్యాన్ని క్లిష్టతరం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి అనేక కొత్త సవాళ్ల మధ్య భారత్ నూతన మార్గాన్ని అన్వేషిస్తోందని చెప్పారు. ముఖ్యంగా పశ్చిమాసియా, యూరప్‌లో ఉన్న యుద్ధ వాతావరణం కొత్త సవాళ్లను మన ముందుంచిందని, ఈ సవాళ్లను ఎదుర్కొని ప్రపంచాన్ని కొత్త మార్గంలో వెళ్లే దిశగా సుదృఢమైన పాత్రను భారత్ పోషిస్తోందన్నారు.