Farmers Government Talks : కనీస మద్దతు ధర సహా ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం నాలుగో సారి చర్చలు జరిపింది. ప్రభుత్వం తరుపున మంత్రుల బృందం, రైతు సంఘాల నేతలతో ఆదివారం సాయంత్రం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి అర్జున్ ముండా, వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.
'ఎలక్షన్ కోడ్ రాకముందే డిమాండ్లను అంగీకరించండి'
అంతకుముందు కేంద్రం కాలయాపన చేయకుండా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే తమ డిమాండ్లను అంగీకరించాలని రైతు సంఘాలు కోరాయి. కేంద్రమంత్రుల బృందంతో జరుగుతున్న చర్చలకు ముందు రైతు సంఘం నేత జగ్జీత్‌సింగ్ దల్లేవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించటం సహా ఇతర డిమాండ్లపై రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు చేపట్టారు.
'బీజేపీ నాయకుల ఇళ్లముట్టడి చేయనున్నాం'
తమ డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా '‘దిల్లీ చలో' చేపట్టిన రైతులకు మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా మంగళవారం నుంచి గురువారం వరకు పంజాబ్‌లోని బీజేపీ నాయకుల ఇళ్లను ముట్టడించనున్నట్లు ప్రకటించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా నేతలు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీన నాలుగు రాష్ట్రాల్లో ధర్నాలు చేయనున్నట్లు భారతీయ కిసాన్ యూనియ నేత రాకేశ్ టికైత్ ఇదివరకే ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ధర్నాలు జరుగుతాయని తెలిపారు. దాంతోపాటు ఈ నెల ఆఖరి వారంలో దిల్లీకి ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టాలని సిసౌలీ పంచాయత్‌లో నిర్ణయించినట్లు వెల్లడించారు.
పంటలకు కనీస మద్దతు ధర, ఎం.ఎస్.స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, గతంలో రైతులు చేపట్టిన ఆందోళనల్లో మృతి చెందిన కర్షకుల కుటుంబాలకు సాయం అందించడం సహా ఇతర డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ గత వారం రైతు సంఘాలు ‘దిల్లీ చలో’కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ట్రాక్టర్లు, ట్రాలీతో ర్యాలీగా బయలుదేరిన రైతులను శంభు సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. దిల్లీ వైపు వెళ్లకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, కాంక్రీట్ దిమ్మెలు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించేందుకు ప్రయత్నించిన వారిపై బాష్ప వాయుగోళాలను ప్రయోగించారు. దీంతో కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించాలని, లేదంటే శాంతియుతంగా దిల్లీ వరకు ర్యాలీ చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ రైతులు ఐదు రోజులుగా సరిహద్దుల్లోనే ఉండిపోయారు. శంభు ప్రాంతంలో ఆందోళనకు దిగిన రైతులకు సారథ్యం వహిస్తున్న జగ్జీత్‌సింగ్ దల్లేవాల్, కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయటం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 8, 12, 15 తేదీల్లో రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.
మళ్లీ రైతుల పోరుబాట.. డిమాండ్ల సాధనకు దేశవ్యాప్తంగా ర్యాలీలు
'పాజిటివ్'గానే సాగాయ్- కానీ మరోసారి రైతులతో చర్చలు : కేంద్రం