External Minister Jaishankar On Canada : గతేడాది కెనడాలో భారత దౌత్య అధికారులపై వరుస బెదిరింపులు వచ్చాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆ దేశ వ్యవస్థల నుంచి ఎలాంటి సహకారం లభించలేదని చెప్పారు. అందుకే అక్కడ వీసా జారీ సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని మంత్రి వివరించారు.
ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ఏజెంట్లే కారణమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిరాధార ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కెనడాలో పనిచేస్తున్న భారత దౌత్యవేత్తపై అక్కడి ప్రభుత్వం బహిష్కరణ వేటువేసింది. దీనికి ప్రతిచర్యగా భారత్ కూడా దిల్లీలోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. దీంతో భారత్-కెనడా మధ్య అప్పట్లో దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి. దాని కారణంగా గతేడాది సెప్టెంబర్‌లో భారత్ అక్కడ వీసా సేవలను నిలిపివేసింది. కాగా ఆ సమయంలో తలెత్తిన పరిస్థితులను వివరిస్తూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
నిందితులపై చర్యలకు భారత్ డిమాండ్
అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్, లండన్‌లోని భారత హైకమిషన్‌పై దాడులు చేసిన వారితో పాటు కెనడాలో భారత దౌత్యాధికారులను బెదిరించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని జైశంకర్ డిమాండ్ చేశారు. కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు ఓ దశలో భారత దౌత్య కార్యాలయాలపై 'స్మోక్ బాంబు'లు విసిరారని వెల్లడించారు. అలాంటి దుండగులకు అక్కడ అంత స్వేచ్ఛ లభించడంపై జైశంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులను బెదిరించే స్థాయికి వాక్‌స్వేచ్ఛ విస్తరించడం మంచిది కాదని హితవు పలికారు.
'తప్పుడు సంకేతాలు వేళ్తాయ్'
ఇలాంటి ఘటనలు యూకే, యూఎస్, ఆస్ట్రేలియాలోనూ దాడులు జరిగాయని జైశంకర్ గుర్తుచేశారు. ఆ సమయంలో భారత దౌత్య కార్యాలయాలకు తగినంత భద్రత లభించలేదని వెల్లడించారు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయని చెప్పారు. అయితే ఇప్పుడు అక్కడ ఎలాంటి దాడి ఘటనలు జరిగినా చాలా బలమైన ప్రతిస్పందన వస్తుందని వెల్లడించారు. ఒక దేశ దౌత్య కార్యాలయాలపై దాడులు జరిగినప్పుడు, అక్కడి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల తప్పుడు సంకేతాలు పంపిస్తాయని జైశంకర్ స్పష్టం చేశారు.
పాక్‌కు కౌంటర్ ఇచ్చిన కశ్మీరీ జర్నలిస్ట్‌కు ఎయిర్‌పోర్ట్‌లో అవమానం! క్లారిటీ ఇచ్చిన కస్టమ్స్
'ఎన్నికల కోసమే కేంద్రం కొత్త సర్వే- కులగణనతో జనాభా లెక్కింపు పూర్తి చేయండి'