Explosion Cracker Factory Today : తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 10 మంది మరణించారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో ఆరుగురు శివకాశి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలపై విచారణ చేపట్టారు. వెంబకొట్టాయి పోలీసుస్టేషన్ పరిధిలోని రాము దేవన్‌పట్టిలో శనివారం జరిగిందీ దుర్ఘటన.
-
#WATCH | Explosion occurs in a firecracker manufacturing unit in Tamil Nadu's Virudhunagar; details awaited pic.twitter.com/cALcg6A9Ow
— ANI (@ANI) February 17, 2024
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా సమీపంలో మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడం వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. మరోవైపు, ఈ పేలుడుపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి, ఏఎమ్ఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మహారాష్ట్రలో అగ్నిప్రమాదం
మహారాష్ట్రలోని ముంబయిలో జరిగిన అగ్నిప్రమాదంలో 15 వాణిజ్య యూనిట్లు, కొన్ని ఇళ్లు దగ్ధమయ్యాయి. గోవండి ప్రాంతంలో శనివారం వేకువజామున జరిగిందీ అగ్నిప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఐదు గంటలపాటు అగ్నిమాపక దళాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయని పేర్కొన్నారు.
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు
మధ్యప్రదేశ్‌లోని ఓ బాణసంచా కర్మాగారంలో ఇటీవలే పేలుడు సంభవించి 11 మంది మృతి చెందారు. మరో 174 మంది గాయపడ్డారు. ఈ ఘటన హర్దా జిల్లాలో జరిగింది. ఇందౌర్, భోపాల్ నుంచి ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి.
అసలేం జరిగిందంటే?
ఈ ఘటన బైరగర్ పట్టణంలోని మగర్ధ రోడ్డులో అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా ప్యాక్టరీలో జరిగింది. పేలుడు అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ భారీ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, దుకాణాల కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయని స్థానికులు తెలిపారు. అలానే, పేలుడు తీవ్రతకు పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
పెయింట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం- 11కు చేరిన మృతుల సంఖ్య- రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా