Do Not Do These Things Infront of Childrens: పిల్లల ప్రవర్తన విషయంలో చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు. చెప్పిన మాట వినడం లేదని, సరిగ్గా చదవడం లేదని, ఫోన్ ఎక్కువ చూస్తున్నారని, పొద్దున్నే లేవడం లేదని.. ఇలా రకరకాల కారణాలతో ఆవేదన చెందుతుంటారు. ఎన్ని రకాలు ప్రయత్నాలుచేసిన వారిలో మార్పు రావడం లేదని మదనపడుతుంటారు. అయితే ఇలాంటివి జరగడానికి తల్లిదండ్రుల ప్రవర్తనే ఎక్కువశాతం కారణమంటున్నారు నిపుణులు. అవును మీరు విన్నది నిజమే. ఎందుకంటే పిల్లల ముందు తల్లిదండ్రులు చేసే కొన్ని పనుల వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే పిల్లల ముందు ఇటువంటి పనులు చేయొద్దని అంటున్నారు. ఆ పనులేంటో ఈ స్టోరీలో చూద్దాం..
ఫోన్ యూసేజ్: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా లేకుండా అందరూ ఫోన్లను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్లతోనే గడుపుతున్నారు. అయితే పిల్లలు ఫోన్ ఎక్కువ చూడటానికి కారణం పేరెంట్సే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే యథా రాజా తథా ప్రజా అన్నట్టు.. తల్లిదండ్రులు అదేపనిగా మొబైల్ ఉపయోగిస్తే పిల్లలు కూడా అలాగే చేస్తారని అంటున్నారు. కాబట్టి పిల్లల ముందు సెల్‌ఫోన్‌ని ఎక్కువగా ఉపయోగించకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లను ఎక్కువగా యూజ్ చేయడం వల్ల పిల్లలపై పెట్టే శ్రద్ధ కూడా తగ్గిపోతుందని పలు సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. కాబట్టి పిల్లల సమక్షంలో సాధ్యమైనంత వరకు మొబైల్‌ను పక్కకు పెట్టమని సలహా ఇస్తున్నారు. ఇలా తల్లిదండ్రులు పాటిస్తూనే.. పిల్లల చేత కూడా ఈ ‘నో స్క్రీన్’ అలవాటును పాటింపజేయమని సూచిస్తున్నారు. ఒకవేళ ఆన్‌లైన్ క్లాసులు, స్కూల్ ప్రాజెక్టుల కోసం ఉపయోగించాల్సి వస్తే దాని కోసం ఒక టైం సెట్ చేయమంటున్నారు.
అలర్ట్ : మీ పిల్లలు ఆన్‌లైన్‌కు బానిసవుతున్నారా? - ఈ టిప్స్‌తో మీ దారిలోకి తెచ్చుకోండి!
ఫుడ్: చిన్న వయసులోనే చాలా మంది పిల్లలు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణాలు.. జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం చేయకపోవడం. అయితే పిల్లలకు ఆకలైందంటే కొంతమంది తల్లులు రెండు నిమిషాల్లో అయిపోతుందిగా అని నూడుల్స్ చేసి పెడుతుంటారు. ఇది ఒకరోజు రెండు రోజులు అయితే ఫర్వాలేదు. రోజు ఇలానే చేస్తే అదే అలవాటవుతుంది. తద్వారా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి పిల్లలకు వీలైనంతవరకు పోషకాహారమే పెట్టేలా చూసుకోమంటున్నారు. అలాగే మరికొంతమంది పిల్లలు వ్యాయామం చేయడానికి బద్ధకిస్తుంటారు. అయితే పిల్లలను వ్యాయామం చేయమని పేరెంట్స్ లేటుగా నిద్ర లేస్తే ఎలాంటి లాభం ఉండదని.. కాబట్టి ఆహారం, వ్యాయామం విషయాల్లో పిల్లలకు చెప్పే మంచి అలవాట్లు ముందు మీరు ఆచరించి చూపించమని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని చూసి వారే నెమ్మదిగా మారతారని అంటున్నారు. ఇవే కాకుండా మరికొన్ని విషయాల్లో కూడా పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అవి..
- పిల్లల ముందు ఇతరులను కించపరచడం, తక్కువ చేసి మాట్లాడడం, తిట్టడం.. వంటివి చేయకూడదంటున్నారు. ఎందుకంటే అవే మాటలను ఇతరులపై చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు.
- కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముందే డ్రికింగ్, స్మోకింగ్ వంటివి చేస్తుంటారని.. దీనివల్ల పిల్లలు కూడా ఆ అలవాట్లకు ప్రేరేపితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
- కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముందే తమ భాగస్వామిని, ఇతర కుటుంబ సభ్యులను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఇలా మీ ప్రవర్తన చూసి కొన్నాళ్లకు వాళ్లు కూడా మీలాగే తయారైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.
- ఈ వయసులో వారికి ఏం తెలియదులే అనే భావనతో కొంతమంది తల్లిదండ్రులు వారి ముందే రొమాన్స్ చేస్తుంటారు. దీనివల్ల వాళ్ల మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. అనవసర విషయాలకు ప్రేరేపితమై తప్పటడుగులు వేసే అవకాశం ఉందంటున్నారు.
మీ పిల్లలు నిత్యం నవ్వుతూ ఉండాలా? - అయితే ఈ 5 విషయాలు చెప్పండి!
మీ పిల్లలు క్లాస్ ఫస్ట్ తెచ్చుకుంటే చూడాలనుందా? - తల్లిదండ్రులుగా మీరు ఇవి చేయాలి!