Election Commission Vacancies : ఎన్నికల కమిషనర్లుగా అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ, అరుణ్ గోయల్ అనుహ్య రాజీనామాతో కేంద్ర ఎన్నికల సంఘంలో ఏర్పడిన ఖాళీల భర్తీ మరో ఐదు రోజుల్లో జరగనుంది! ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్చి 15వ తేదీన ప్రధాని నేతృత్వంలో సెలక్షన్ కమిటీ భేటీ కావచ్చని చెప్పాయి. మార్చి 15వ తేదీలోగా నియామకాలు జరిగే అవకాశం ఉందని వెల్లడించాయి.
రాజీనామాకు కారణం అదే!
మరో మూడేళ్ల పదవీ కాలం ఉండగానే అరుణ్ గోయల్ రాజీనామా చేయడం వల్ల వస్తున్న వార్తలపై సంబంధిత వర్గాలు స్పందించాయి. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన రాజీనామా చేసి ఉండొచ్చని చెప్పాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్, అరుణ్ గోయల్‌కు మధ్య విబేధాల వల్లే రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలను ఖండించాయి. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ గోయల్ 2022 నవంబర్‌లో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
రాజీవ్ ఒక్కరే!
అయితే కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు కమిషనర్లు ఉంటారు. ఫిబ్రవరి 14వ తేదీన అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. ఇప్పుడు అరుణ్ గోయల్ అనుహ్యాంగా రాజీనామా చేయగా, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మాత్రమే మిగిలారు. సెలక్షన్ కమిటీ రెండు రోజుల క్రితం సమావేశం కావాల్సి ఉండగా, వాయిదా పడింది. మరి కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకం ఎలా జరుగుతుందంటే?
సుప్రీంకోర్టు ఆదేశాలతో!
దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం గతేడాది ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ యాక్ట్-2023 చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం తొలుత కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు కేంద్ర కార్యదర్శులతో కూడిన సెర్చ్ కమిటీ రెండు కమిషనర్ల పోస్టుల కోసం ఐదుగురి పేర్లను సెలక్షన్ కమిటీకి పంపాలి.
ప్రధాని నేతృత్వంలో!
సెలక్షన్ కమిటీకి ప్రధాన మంత్రి ఛైర్మన్‌గా ఉంటారు. లోక్‌సభలో విపక్ష నేత, ఓ కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు. సెలెక్షన్ కమిటీకి కొన్ని విచక్షణాధికారాలుంటాయి. సెర్చ్ కమిటీ పరిగణనలోకి తీసుకున్న పేర్లను సైతం అవసరమనుకుంటే సెలక్షన్ కమిటీ పరిశీలించవచ్చు. కమిటీ పంపే పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. సీఈసీ, కమిషనర్లు ఆరేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వరకు పదవిలో ఉంటారు.
అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి గతేడాది వరకు కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకాలు జరిగేవి. కేంద్ర సిఫార్సుల మేరకే రాష్ట్రపతి నియమించేవారు. రాజ్యాంగంలోని 324- 329 అధికరణలు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల నియామకం, జీతభత్యాలు, కాలపరిమితి, విధులను తెలియజేస్తున్నాయి.
ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా- లోక్‌సభ ఎన్నికలకు ముందు సంచలన నిర్ణయం!
'బీజేపీ టికెట్‌పై అరుణ్ గోయెల్ పోటీ?'- ఎన్నికల కమిషనర్ రాజీనామాపై విపక్షాలు ఫైర్