మిగిలిపోయిన అన్నంతో "ఎగ్ ఫ్రైడ్ రైస్" - తిన్నారంటే వారెవ్వా ఏం టేస్ట్ రా బాబు అంటారు! - Egg Fried Rice Recipe - EGG FRIED RICE RECIPE
Perfect Egg Fried Rice Recipe : ఎక్కువ మంది ఇష్టపడే ఫాస్ట్‌పుడ్ ఐటమ్స్‌లో ఒకటి.. ఎగ్ ఫ్రైడ్ రైస్. అలాంటి వారు ఇకపై ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్ వెళ్లాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా ఇంట్లోనే ఇలా స్పైసీ అండ్ టేస్టీ 'ఎగ్ ఫ్రైడ్ రైస్' ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, అదెలాగో ఇప్పుడు చూద్దాం.


Published : Aug 7, 2024, 9:25 AM IST
How To Make Egg Fried Rice in Telugu : డైలీ పప్పు, కూర, పచ్చడి, పెరుగు లాంటివే తినాలంటే పిల్లలకే కాదు.. పెద్దలకీ బోర్‌గా అనిపిస్తోంది. అలాగని బిర్యానీనో, పులావో చేయాలంటే టైమ్ పడుతుంది. అందుకే.. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినేలా, ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా.. పర్ఫెక్ట్ కొలతలతో అద్దిరిపోయే 'ఎగ్ ఫ్రైడ్ రైస్' రెసిపీ తీసుకొచ్చాం. దీన్ని వేడి వేడి అన్నం లేదా మిగిలిపోయిన రైస్.. ఇలా దేనితో ప్రిపేర్ చేసుకున్నా రుచి సూపర్‌గా ఉంటుంది! మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- రైస్ - ఒక కప్పు
- ఎగ్స్ - 4
- ఉప్పు - రుచికి తగినంత
- నూనె - కావాల్సినంత
- ఆవాలు - పావు టీ-స్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 3
- క్యాప్సికం తరుగు - పావు కప్పు
- టమాటా తరుగు - పావు కప్పు
- పసుపు - పావు టీస్పూన్
- కారం - అర టీస్పూన్
- మిరియాల పొడి - అర టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- నిమ్మరసం - కొంచెం
తయారీ విధానం :
- ముందుగా స్టౌపై పాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడి అయ్యాక నాలుగు గుడ్లను(Eggs) కొట్టి పోసుకోవాలి.
- ఆపై వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి. ఇలా ఉంచడం వల్ల ఎగ్స్ కాస్త వేగుతాయి.
- ఆ తర్వాత కాస్త నెమ్మదిగా గరిటెతో కదుపుకోవాలి. అది కూడా ఎగ్స్ మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కాస్త పెద్దగానే ఉండేలా చూసుకోవాలి.
- అనంతరం కొద్దిగా ఉప్పు వేసి మరోసారి మిశ్రమాన్ని మిక్స్ చేసుకుంటూ గుడ్డు పైన నురగ ఏర్పడే వరకు వేయించుకోవాలి. అంతేకానీ.. ఎగ్ ఎక్కువగా వేగితే రబ్బర్లా సాగుతుందనే విషయాన్ని గమనించాలి.
- ఆవిధంగా వేయించుకున్న గుడ్డు మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి హై ఫ్లేమ్ మీద కాసేపు టాస్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా అందులో వేసి వేపుకోవాలి.
- తాలింపు వేగిందనుకున్నాక.. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. అనంతరం పచ్చిమిర్చి తరుగూ యాడ్ చేసుకొని 30 సెకన్ల పాటు వేయించుకోవాలి.
- పచ్చిమిర్చి వేగాక.. క్యాప్సికం, టమాటా తరుగు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని టమాటాలపైన స్కిన్ సాఫ్ట్‌గా మారే వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ మిశ్రమాన్ని అందులో వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
- ఆవిధంగా ఎగ్స్ మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాక.. అప్పుడే వండుకున్న లేదా మిగిలిపోయిన ఒక కప్పు అన్నాన్ని అందులో వేసి మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి బాగా టాస్ చేసుకోవాలి. అంటే.. మిశ్రమం మొత్తం బాగా కలిసి వేడెక్కాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- ఇక చివరగా దింపే ముందు.. మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసుకొని ఒక నిమ్మకాయను పిండుకోవాలి.
- ఆపై స్టౌ ఆఫ్ చేసి ఒకసారి బాగా టాస్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా, స్పైసీగా ఉండే 'ఎగ్ ఫ్రైడ్ రైస్' ఘుమఘుమలాడుతూ మీ కళ్ల ముందు కనిపిస్తుంది.
ఇవీ చదవండి :
మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ - ఇంట్లోనే సూపర్ క్వాలిటీగా - ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బలాదూర్!