Congress On Indian Economy : దేశ ఆర్థిక వృద్ధి రెండేళ్ల కనిష్ఠానికి క్షీణించడంపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. దేశ మధ్యస్థ, దీర్ఘకాలిక ఆర్థిక సామర్థ్యం వేగంగా క్షీణిస్తోందని ఆరోపించింది. భయంకరమైన వాస్తవాలను ఎంతకాలం దాస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు.
"జులై-సెప్టెంబర్ 2024కి సంబంధించిన దేశ జీడీపీ వృద్ధి గణాంకాలు ఊహించిన దానికంటే చాలా దారుణంగా ఉన్నాయి. భారత్ 5.4శాతం వృద్ధిని నమోదు చేసింది. వినియోగ వ్యయాల వృద్ధి 6శాతం వృద్ధి చెందింది. ఈ ఆర్థిక మందగమనానికి గల కారణాల పట్ల నాన్ బయోలాజికల్ ప్రధాన మంత్రి, ఆయన సహచరులు అంటిముట్టనట్లుగా ఉన్నారు. దేశ జీడీపీ గురించి ముంబయికి చెందిన ప్రముఖ ఆర్థిక సమాచార సేవల సంస్థ, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ విడుదల చేసిన 'లేబర్ డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్' అనే కొత్త నివేదిక వెల్లడించింది."
-- జైరాం రమేశ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
మోదీ కన్నా మన్మోహన్ హయాంలో బెటర్!
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో హరియాణా, అసోం, యూపీలోని కార్మికుల వేతనాలు కూడా క్షీణించాయని జైరాం రమేశ్ ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో వ్యవసాయ కార్మికులకు ఏటా వేతనాలు 6.8శాతం చొప్పున పెరిగాయని అన్నారు. నరేంద్ర మోదీ హయాంలో వ్యవసాయ కార్మికులకు వేతనాలు ప్రతి ఏటా 1.3శాతం తగ్గాయని విమర్శించారు.
"2017-2022 మధ్య కాలంలో కార్మికులు, స్వయం ఉపాధి కార్మికుల ఆదాయాలు తగ్గాయి. ఇటుక బట్టీ కార్మికుల వేతనాలు తగ్గుముఖం పట్టాయి. దేశ జీడీపీపై వాస్తవాలను ఎంతకాలం విస్మరిస్తారు. ప్రధానమంత్రి హైప్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు దేశ ప్రజలు ఆశతో జీవించడం కొనసాగిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ 8.1 శాతం వృద్ధి చెందింది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 4.3 శాతం వద్ద మునుపటి కంటే కనిష్ట స్థాయిలో జీడీపీ వృద్ధి నమోదైంది." అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.
అదానీ విషయంలో కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు
అదానీ గ్రూప్‌పై అమెరికా జరిపిన దర్యాప్తులో భారత ప్రభుత్వం ఏ విధంగానూ భాగం కాదన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 'అదానీ గ్రూప్ వ్యవహారంలో అమెరికా దర్యాప్తులో భారత ప్రభుత్వం భాగం కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ప్రభుత్వం తనకు తాను దర్యాప్తులో ఎలా భాగం అవుతుందిలే?" అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ విమర్శించారు. ప్రభుత్వంపైనే విమర్శలు వచ్చాయనే ఉద్దేశంలో ఈ విమర్శలు గుప్పించారు.
సౌరశక్తి సరఫరా ఒప్పందాలు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు అదానీ గ్రూపు లంచాలు ఇచ్చారని అమెరికా చేసిన ఆరోపణలపై భారత విదేశాంగ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందించారు. "ఇది ప్రైవేటు సంస్థలు, కొంతమంది వ్యక్తులు, అమెరికా న్యాయశాఖకు సంబంధించిన అంశం. ఇటువంటి కేసుల్లో అనుసరించాల్సిన విధానాలు, చట్టపరమైన మార్గాలు స్పష్టంగా ఉన్నాయి. అవి వాటిని అనుసరిస్తాయని విశ్వసిస్తున్నాం. ఇప్పటివరకు భారత సర్కారుకు ఎటువంటి సంబంధం లేని ఈ అంశంపై అమెరికా ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు జరపలేదు" అని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తాజాగా విమర్శలు గుప్పించింది.