ECI Bans Randeep Surjewala From Campaigning : బీజేపీ ఎంపీ హేమమాలినిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు రావడం వల్ల కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఆయనపై నిషేధాన్ని విధించింది. ఈ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో ఈసీ విధించిన మొదటి ప్రచార నిషేధం ఇదే కావడం గమనార్హం. హరియాణాలో ఎన్నికల ప్రచారం చేస్తూ హేమమాలినిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గత మంగళవారమే సూర్జేవాలాకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది.
దీనికి బదులిస్తూ సూర్జేవాలా సమర్పించిన ప్రత్యుత్తరాన్ని నిశితంగా పరిశీలించిన ఈసీ, ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. "హేమమాలినిపై సూర్జేవాలా అత్యంత అసభ్యకర, అనాగరిక వ్యాఖ్యలు చేశారు. అలాంటి మాటలు ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకం" అని ఈసీ వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం, సూర్జేవాలా 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా బ్యాన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిషేధం అమల్లో ఉండే వ్యవధిలో బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటర్వ్యూలు, మీడియా వేదికల్లో సూర్జేవాలా ప్రసంగాలు చేయకూడదని ఈసీ స్పష్టం చేసింది.
వీడియో ఏమిటి ? దుమారం ఎందుకు ?
ఈనెల 3న బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవీయ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బీజేపీ నాయకురాలు హేమమాలినిపై కాంగ్రెస్ నేత సూర్జేవాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా అందులో కనిపించింది. "ధర్మేంద్రను పెళ్లి చేసుకున్న హేమమాలిని అంటే మాకు గౌరవం ఉంది. ఆమె మన కోడలు కూడా. అయితే వీళ్లు ఫిల్మ్ స్టార్‌లు. కానీ మేం వారిలా కాదు. మీరు నన్ను కానీ లేదా గుప్తాజీని కానీ ఎంపీ, ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మేం మీకు సేవలందిస్తాం" అని సూర్జేవాలా వ్యాఖ్యలు చేయడం ఆ వీడియోలో ఉంది. దీనిపై అప్పట్లో స్పందించిన హేమమాలిని, "ప్రముఖులను మాత్రమే వాళ్లు టార్గెట్ చేస్తుంటారు. పాపులారిటీ లేనివారి గురించి మాట్లాడితే వాళ్లకు ఒరిగేది ఏముంటుంది ? ఇలాంటి వాళ్లు మహిళలను ఎలా గౌరవించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూసి నేర్చుకోవాలి" అని హితవు పలికారు.