EC Voter Turnout Data issue : పోలింగ్ కేంద్రాలవారీగా ఓటింగ్ శాతాలను బహిర్గతం చేసి వెబ్‌సైట్‌లో ప్రచురించడం వల్ల ఎన్నికల యంత్రాంగం గందరగోళానికి గురవుతుందని భారత ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. పోలింగ్ స్టేషన్‌లో పోలైన ఓట్ల సంఖ్యను తెలిపే ఫారం 17సీ స్కాన్డ్ ప్రతుల రూపంలో పొందుపరచడం చట్టబద్ధంగా లేదని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో మొదటి, రెండో విడతలో పోలింగ్ రోజున ఈసీ వెల్లడించిన ఓటింగ్ శాతం కన్నా తర్వాత విడుదల చేసిన ఓటింగ్ శాతం అయిదారు శాతం ఎక్కువగా ఉందన్న ఆరోపణలను ఈసీ ఖండించింది. అవన్నీ తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది.
అఫిడవిట్ దాఖలు చేసిన ఎన్నికల సంఘం
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటింగ్ వివరాలను ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఈసీని ఆదేశించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ మే 17న పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వారం రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని ఎన్నికల సంఘాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో 225 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది.
"పిటిషనర్ కోరిన పోలింగ్ కేంద్రాలవారీగా ఓటింగ్ శాతాలను వెబ్‌సైట్‌లో ప్రచురిస్తే ఎన్నికల యంత్రాంగం గందరగోళానికి గురవుతుంది. 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పిటిషనర్ లేవనెత్తిన ఆరోపణలు నిరాధారమైనవి. పోలింగ్ శాతం ప్రకటనలో హెచ్చుతగ్గులు ఆరోపణలు మాత్రమే. అవన్నీ అనుమానంతో చేసినవే. పోలింగ్ ముగిసిన తర్వాత ఫారం 17సీ కాపీని పొందే అధికారం పోలింగ్ ఏజెంట్‌కు ఉంది. ప్రస్తుతానికి ఒరిజినల్ ఫారం 17సీ కాపీ స్ట్రాంగ్ రూమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫారం 17సీ కాపీని మరే ఇతర సంస్థకు ఇవ్వడానికి నిబంధనలు అనుమతించవు. పోలింగ్ కేంద్రాలవారీగా ఓటింగ్ శాతాలను బహిర్గతం చేసి వెబ్‌సైట్‌లో పెట్టడం వల్ల ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల ఫలితాల సమయంలో కూడా ప్రజలకు అనుమానాలు వస్తాయి" అని అఫిడవిట్లో భారత ఎన్నికల సంఘం పేర్కొంది.
'ఈసీ వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టట్లేదు'
మరోవైపు, ఫారం 17సీని బహిర్గతం చేయాలనే అభ్యర్థనను వ్యతిరేకిస్తూ ఈసీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ స్పందించారు. 'ప్రతి పోలింగ్ స్టేషన్‌లో పోలైన ఓట్ల సంఖ్యను తెలిపే ఫారం 17సీ పత్రాన్ని ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడానికి ఎటువంటి నిబంధన లేదని ఈసీ తన అఫిడవిట్లో పేర్కొంది. ఫారం 17సీని ప్రిసైడింగ్ అధికారి సంతకం చేసి పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ ఏజెంట్‌కు ఇస్తారు. మరి ఆ డేటాను ఈసీ ఎందుకు వెబ్‌సైట్‌లో ప్రచురించట్లేదు. అసలేంటీ సమస్య?' అని ప్రశ్నించారు.
-
#WATCH | On the issue of Form 17C to make information on votes polled public, Senior advocate and Rajya Sabha MP Kapil Sibal says, "...Why does the Election Commission not put this data on their website? What is their hesitation or problem?..." pic.twitter.com/hj76YLZnx3
— ANI (@ANI) May 23, 2024
ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన తల్లీకొడుకులు- ఇద్దరిలో 'ఆమె'కే ఎక్కువ మార్కులు
పుణె రాష్ డ్రైవింగ్ కేసులో మైనర్ బెయిల్ రద్దు- 15 రోజుల రిమాండ్! - Pune Porsche Accident