EC Removed Government Officials : దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల హోంశాఖ కార్యదర్శులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదేవిధంగా పశ్చిమబెంగాల్ డీజీపీని ఆ బాధ్యతల నుంచి తప్పించింది.
లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఎన్నికల సంఘం ఈమేరకు చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి. బృహన్ ముంబయి మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చాహల్‌తోపాటు అదనపు కమిషనర్లు, ఉప కమిషనర్లపైనా వేటు పడింది. మిజోరం, హిమాచల్ ప్రదేశ్‌ల సాధారణ పరిపాలనా విభాగాల కార్యదర్శులను కూడా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. సీఈసీ రాజీవ్ కుమార్‌తోపాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు సోమవారం సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
'బీజేపీ తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది'
అయితే బంగాల్ డీజీపీని తొలగించడంపై టీఎంసీ పార్టీ నాయకుడు కునాల్ ఘోష్ స్పందించారు. "ఎన్నికల సంఘం వంటి సంస్థలను కూడా చేజిక్కించుకోవడానికి భారతీయ జనతా పార్టీ తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. తమ రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఇలా చేస్తోంది" ఆయన ఆరోపించారు.
ఇటీవల సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుండగా, జూన్ ఒకటిన జరిగే ఏడో విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం తప్ప మిగతా ప్రాంతాల్లో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నారు. ఆ రెండు చోట్ల జూన్ 2వ తేదీ కౌంటింగ్ నిర్వహించనుంది.
దేశంలో మొత్తం 96.88 కోట్ల ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 49.7 కోట్ల మంది ఉండగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారు. 85 ఏళ్ల పైబడిన ఓటర్ల సంఖ్య 82 లక్షలు. 20-29 ఏళ్ల వయసు మధ్య ఉన్న ఓటర్లు19.74 కోట్ల మంది ఉన్నారు. ఈసారి 18-19 వయసున్న యువ ఓటర్లు కొత్తగా ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఈ ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు వినియోగిస్తున్నారు. 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో 1.5 కోట్ల మంది పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది పాలు పంచుకోనున్నారు.