EC On Children Election Campaign : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ రూపంలోనైనా చిన్నారులను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించవద్దని రాజకీయ పార్టీలకు స్పష్టం చేసింది. పోస్టర్లు అతికించడం, కరపత్రాల పంపిణీ, నినాదాలు చేయడం సహా ఎందులోనూ పిల్లలను ప్రచారంలో భాగం చేయవద్దని పార్టీలకు విజ్ఞప్తి చేసింది.
'చిన్నారుల ప్రమేయాన్ని సహించేది లేదు'
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో చిన్నారుల ప్రమేయాన్ని సహించేది లేదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ నాయకులు, పోటీ చేసే అభ్యర్థులు తమ చేతులతో చిన్నారులను ఎత్తుకోవడం, వాహనంలో ర్యాలీలో పిల్లలను తీసుకెళ్లడం సహా ఏ పద్ధతిలోనైనా ప్రచార కార్యక్రమాలకు పిల్లలను ఉపయోగించకూడదని సీఈసీ తెలిపింది. పద్యాలు, పాటలు, రాజకీయ పార్టీ, అభ్యర్థి చిహ్నాల ప్రదర్శనలకు కూడా పిల్లలను వినియోగించుకోవద్దని సూచించింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంలో క్రియాశీల పక్షాలు అన్నీ భాగస్వాములు కావాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కోరారు.
EC New Rules : దివ్యాంగుల పట్ల గౌరవప్రదమైన ప్రసంగాలు చేయాలని కొన్నాళ్ల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు సూచించింది. ప్రస్తుతం అదే తరహాలో చిన్నారుల విషయంలో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టినప్పుటి నుంచి సీఈసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
కర్ణాటక ప్రభుత్వంపై ఈసీ సీరియస్
గతేడాది నవంబరులో కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కర్ణాటక సర్కార్ ప్రకటనలు ఇవ్వడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ప్రకటనల జారీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని సీఈసీ(CEC) తన లేఖలో పేర్కొంది. ప్రకటనల జారీపై సంబంధిత శాఖ కార్యదర్శిపై చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలపాలని లేఖలో పేర్కొంది. రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఈసీ సమాచారం పంపింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.