DK Suresh Controversy Statement : బడ్జెట్ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతోందని, దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతుందని కర్ణాటక ఎంపీ డీకే సురేశ్ చేసిన వ్యాఖ్యలతో ఉభయసభల్లో తీవ్ర దుమారం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందేనని, డీకే సురేశ్‌పై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు.
రాజ్యాంగానికి అవమానం!
లోక్‌సభలో జీరో అవర్‌లో డీకే సురేశ్ వ్యాఖ్యల అంశాన్ని లేవనెత్తారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సురేశ్ వ్యాఖ్యలు రాజ్యాంగంతోపాటు బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానిస్తున్నట్లుగా ఉన్నాయని అన్నారు. డీకే సురేశ్ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని, ఈ విషయాన్ని లోక్‌సభ ఎథిక్స్ కమిటీకి సూచించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. డీకే సురేశ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకత్వం కట్టుబడి ఉందో లేదో స్పష్టం చేయాలని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని, డీకే సురేశ్‌పై పార్టీ తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీకే సురేశ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం డిమాండ్ చేశారు.
ఆయనకు ఎంపీగా ఉండే హక్కు లేదు!
కాంగ్రెస్ నేత డీకే సురేశ్‌కు ఒక్క నిమిషం కూడా ఎంపీగా ఉండే హక్కు లేదని లేదని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. దేశ సమైక్యతను పరిరక్షిస్తామంటూ చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించి, దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా బహిరంగంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని ముక్కలు చేస్తారా అని ప్రశ్నించారు. డీకే సురేశ్ వ్యాఖ్యలపై మౌనం వహిస్తున్నందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై బీజేపీ నేత మండిపడ్డారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలంతా ఒక్కటే!
మరోవైపు, రాజ్యసభలో డీకే సురేశ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలనేదే కాంగ్రెస్ సిద్ధాంతమని, విభజన కోరే వారికి పార్టీ ఎప్పటికీ మద్దతు తెలపదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలంతా ఒక్కటేనని తెలిపారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడే ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వారైనా తాము సహించమని అన్నారు.
అవి వ్యక్తిగత అభిప్రాయాలే!
"కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో పోరాడింది. దేశం కోసం అనేక త్యాగాలు చేసింది. మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ మొదలుకొని మనమంతా ఆ వారసత్వం నుంచి వచ్చిన వాళ్లమే. మా స్నేహితుల నుంచి ఈ రకమైన ప్రకటనలు ఆమోదయోగ్యం కాదు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ సహా అనేక మంది దేశ ఐక్యత కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఇలాంటి మాటలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే" అని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ తెలిపారు.
సభా సమయాన్ని వృథా చేయడమే
కాంగ్రెస్ ఎంపీ సురేశ్ స్టేట్మెంట్పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ శశి థరూర్ స్పందించారు. 'మంత్రి రెండు అనవసర విషయాలు సభలో మాట్లాడారు. మొదటిది, సభతో సంబంధం లేకుండా ఓ సమస్య గురించి లేవనెత్తారు. రెండోది, మీడియా కథనాల ఆధారంగా మాట్లాడారు. ఆయన(సురేశ్) సభలో ఆ వ్యాఖ్యలు చేయలేదు. దానిపై చర్చించడం అంటే సభా సమయాన్ని వృథా చేయడామే. దీనికి మంత్రిని అనుమతించడం ఎందుకు?" అని ప్రశ్నించారు.
''ఇండియా' 11 మంది కెప్టెన్లతో ఉన్న జట్టు లాంటిది'
మరోవైపు, విపక్ష ఇండియా కూటమి 11 మంది కెప్టెన్లతో కూడిన క్రికెట్ జట్టు లాంటిదని లోక్‌సభలో బీజేపీ ఎంపీ హీనా గవిత్ ఎద్దేవా చేశారు. ఈ 11 మంది కెప్టెన్లు ఇతర ఆటగాళ్లకు చోటు కల్పించడానికి ఇష్టపడరని చెప్పుకొచ్చారు. ఇండియా కూటమి నాయుకులంతా బిగ్‌బాస్ పార్టిసిపెంట్స్ లాంటి వారని, అందరూ ప్రధానమంత్రి ట్రోఫీ కోసం పోటీ పడతారని విమర్శించారు. మోదీ హయాంలో దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తోందని, అందుకే ఇండియా కూటమి నేతలు ఒకరి తర్వాత మరొకరు పార్టీలు మారడం ఆశ్చర్యమైన విషయం కాదని తెలిపారు.
బంగాల్‌కు మమతా బెనర్జీ కెప్టెన్ అని, ఆమెకు తన జట్టులో కాంగ్రెస్ స్థానం కల్పించడం ఇష్టం లేదని హీనా గవిత్ ఎద్దేవా చేశారు. పంజాబ్‌కు అరవింద్ కేజ్రీవాల్ కెప్టెన్ అని, ఆయన తన జట్టులో 12వ సభ్యుడిగా కాంగ్రెస్‌ను పరిగణిస్తున్నారని ఆరోపించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి మోదీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని తెలిపారు. జనవరి 31న ఉభయసభలను ఉద్దేశించి ఒక మహిళా రాష్ట్రపతి ప్రసంగించగా, మరుసటి రోజు ఒక మహిళా ఆర్థిక మంత్రి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం విశేషమని హీనా గవిత్ తెలిపారు. గిరిజన ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ఎంపీ అయిన తాను రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆమె తెలిపారు.