Delhi PCC President Resigns : లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ దిల్లీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ తన పదవికి ఆదివారం ఉదయం రాజీనామా చేశారు. దిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
అందుకే 150కు పైగా బ్లాకుల్లో!
"నేను డీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి నియామకాలు చేపట్టడానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (దిల్లీ ఇన్‌ఛార్జ్) నన్ను అనుమతించలేదు. డీపీసీసీ మీడియా హెడ్‌గా అనుభవజ్ఞుడైన నాయకుడిని నియమించాలని నేను చేసిన అభ్యర్థనను నిర్మొహమాటంగా తిరస్కరించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి నగరంలో అన్ని బ్లాక్‌ల అధ్యక్షులను నియమించడానికి డీపీసీసీని అనుమతించలేదు. ఫలితంగా దిల్లీలోని 150 బ్లాక్‌లకు పైగా ప్రస్తుతం బ్లాక్ ప్రెసిడెంట్‌లు లేరు" అని లేఖలో రాశారు అర్విందర్.
ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాం!
"హస్తం పార్టీపై తప్పుడు, కల్పిత, దుర్మార్గపు అవినీతి ఆరోపణలను మోపడం కోసమే ఏర్పడిన పార్టీతో పొత్తును దిల్లీ కాంగ్రెస్ యూనిట్ వ్యతిరేకించింది. అయినప్పటికీ దిల్లీలో ఆప్‌తో పొత్తు పెట్టుకోవాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. మేం పార్టీ తుది నిర్ణయాన్ని గౌరవించాము. నేను నిర్ణయాన్ని బహిరంగంగా సమర్థించడమే కాకుండా, హైకమాండ్ తుది ఆదేశానికి అనుగుణంగా రాష్ట్ర యూనిట్ ఉండేలా చూసుకున్నాను. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సూచనల మేరకు నాకు ఇష్టం లేకపోయినా కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన రోజు రాత్రి సుభాష్ చోప్రా, సందీప్ దీక్షిత్‌తో కలిసి ఆయన ఇంటికి కూడా వెళ్లాను" అని లేఖలో గుర్తు చేశారు.
'నాకు అవి నచ్చలేదు'
"కానీ కొందరు చేసిన తప్పుడు ప్రకటనలు నాకు నచ్చలేదు. దిల్లీ అభివృద్ధిపై ఆప్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థించడం కోసం పొత్తు పెట్టుకోలేదు కదా. ఏదేమైనా పార్టీ కార్యకర్తల ప్రయోజనాలను తాను కాపాడలేనని అనిపించించి. ఆ పదవిలో కొనసాగడానికి నాకు ఇష్టం లేదు అందుకే రాజీనామా చేస్తున్నా" అని అర్విందర్ తెలిపారు. గతేడాది ఆగస్టులో ఆయన పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
'EVMలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ'- 'ఇప్పటి వరకు 40 సార్లు ఇలా!' - SC EVMs Verdict
కేరళ పాలిటిక్స్‌లో ట్విస్ట్ - 'ట్వంటీ20' దూకుడు- ప్రధాన పార్టీలకు టెన్షన్! - Lok Sabha Election 2024