Delhi Minister Raaj Kumar Resign : లోక్‌సభ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి మరో దెబ్బ తగిలింది. కేజ్రీవాల్ కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజ్‌కుమార్ ఆనంద్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ప్రకటించారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని అన్నారు. అంతేకాకుండా పార్టీలో దళితులకు సరైన గుర్తింపు లేదని ఆరోపించారు. మోసపోయామనే భావన ఆ వర్గంలో ఉందని, అందుకే ఆప్‌లో కొనసాగకూడదని నిర్ణయించుకున్నట్లు రాజ్‌కుమార్ ఆనంద్ తెలిపారు.
'రాజకీయాలు మారలేదు కానీ రాజకీయ నేత మారారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడింది. ఆ పార్టీ ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయింది. అలాగే ఈ పార్టీలో దళిత ఎమ్మెల్యేలను, కౌన్సిలర్లను, మంత్రులను ఈ పార్టీ గౌరవించదు. ఆప్‌లో నాయకత్వ పదవులకు నియామకాల విషయంలో వివక్ష ఉంది. ఇక ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగటం కష్టంగా ఉంది. అందువల్ల ఆ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. అవినీతితో నా పేరు కలవకూడదని భావిస్తున్నాను. నిన్నటి వరకు మమ్మల్ని ఇరికుస్తున్నారనే భావనలో ఉన్నాం. కానీ దిల్లీ హైకోర్టు తీర్పు తర్వాత ఇదో మోసం జరిగిందని అనిపిస్తోంది'
--రాజ్‌కుమార్ ఆనంద్, దిల్లీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
ఈడీ బెదిరింపులకే భయపడి రాజీనామా!
మరోవైపు రాజ్‌కుమార్ ఆనంద్ రాజీనామాపై ఆప్ ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఉద్దేశమే తమ పార్టీని అంతం చేయడానికేనని పునరుద్ఘాటించారు. ఈడీ, సీబీఐని ప్రయోగించి తమ మంత్రులను, ఎమ్మెల్యేలను బీజేపీ చీల్చుతోందని, ఇది తమందరికీ ఓ పరీక్షలాంటిదన్నారు. ఆనంద్‌ను గతంలో అవినీతిపరుడని పిలిచిన బీజేపీలోనే ఇప్పుడు ఆయన చేరనున్నారంటూ వ్యాఖ్యానించారు. మరో మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ కూడా స్పందించారు. 'రాజ్‌కుమార్ ఆనంద్ రాజీనామా చేసినందుకు మేమందరం ఆయన్ని ద్వేషిస్తున్నామని, నిజాయితీ లేని వాడని, మోసగాడని అని పిలుస్తామని అనుకుంటారు. కానీ మేము అలాంటి మాటాలు ఏమి అనడం లేదు. కుటుంబం కలిగన వ్యక్తి ఈడీ బెదిరింపులకు భయపడి ఉంటాడని నేను నమ్ముతున్నాను' అని సౌరభ్ భరద్వాజ్ అన్నారు.
ఎన్నికల్లో గెలుపుపై చిలుక జోస్యం- జ్యోతిష్యులు అరెస్ట్ - Parrot Owner Held Predicted Poll
ఒక్క ఓటరు కోసం స్పెషల్‌గా పోలింగ్ కేంద్రం- 2007 నుంచి ఇలానే! - Single Voter Polling Booth In India