Cow Saves Family In Wayanad : కేరళ వయనాడ్‌లోని కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోకుండా ఓ కుటుంబాన్ని పెంపుడు ఆవు కాపాడింది. ఆవు అరపులకు వల్ల అప్రమత్తమైన కుటుంబమంతా సురక్షిత ప్రాంతాలకు తరలింది. లేదంటే కొండచరియలు విరిగిపడి బురద మట్టిలో సమాధి అయిపోయేవారు ఆ కుటుంబ సభ్యులు!
ఆవు అరవడం వల్లే
వయనాడ్‌లోని చూరాల్‌మలలో కర్ణాటక చామరాజనగర్‌కు చెందిన వినోద్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. వినోద్ భార్య ప్రవిద కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. వినోద్ మిగతా కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి తన ఇంట్లో వినోద్ నిద్రిస్తుండగా పశవులశాలలోని ఆవు అరవడం మొదలుపెట్టింది. దీంతో వినోద్ లేచి శాలలోకి వెళ్లి చూడగా, అది నీటితో నిండిపోయి ఉంది. వెంటనే వరద, విపత్తును గ్రహించిన వినోద్ ఇతర కుటుంబ సభ్యులు జయశ్రీ, సిద్ధరాజు, మహేశ్, గౌరమ్మను నిద్రలేపి కొండపైన ఉన్న సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. చూరాల్‌మలకు 6కి.మీ దూరంలో వినోద్ అత్తగారి ఊరు మెప్పడి ఉంది. వారికి అర్ధరాత్రి సమయంలోనే విపత్తు గురించి తెలియజేశాడు. దీంతో వారంతా అప్రమత్తమై సురక్షిత ప్రదేశానికి చేరుకున్నారు. అనంతరం పరిస్థితులు సద్దుమణిగాక మంగళవారం సాయంత్రం కారులో చామరాజనగర్‌కు వచ్చారు.
కొండచరియలు విరిగిపడిన చోటే కూతిరి పెళ్లి
కొండచరియలు విరిగిపడిన ఘటనలో వినోద్ ఇల్లు కుప్పకూలింది. అలాగే అతడి వాహనం శిథిలాల కింద కూరుకుపోయింది. అలాగే వినోద్ ఇంటికి సమీపంలో ఉన్న వంతెన కూడా ధ్వంసం అయ్యింది. రెస్క్యూ బలగాలు కొండపై తలదాచుకున్న వినోద్, అతడి కుటుంబ సభ్యులను మంగళవారం సాయంత్రం సురక్షిత ప్రదేశాలకు తరలించాయి. తాము పెంచుకున్న ఆవు దేవుడిలా తమ ప్రాణాలను కాపాడిందని వినోద్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. 'కొండచరియలు విరిగిపడిన చోటే మా కుమార్తె పెళ్లి జరిగింది. మా అల్లుడు వినోద్ కుటుంబ సభ్యులు కొండపై చిక్కుకున్నారు. వారి ఇంటి సమీపంలోని బ్రిడ్జి కూడా విరిగిపోయింది. వారు అక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి ఎలా వస్తారో అర్థం కావడం లేదు' అని వినోద్ అత్త లక్ష్మి తెలిపారు.
వయనాడ్ విలయానికి 'అరేబియా' వేడెక్కడమే కారణమా? కేరళలో ఎప్పటికప్పుడు విషాదాలే! - Wayanad landslides