Amethi Rae Bareli Congress : 2024 ఎన్నికల్లో అమేఠీ, రాయ్‌బరేలీ లోక్‌సభ సీట్లు కాంగ్రెస్ పార్టీకే దక్కుతాయని అమేఠీ కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు చోట్ల ఎంత మెజారిటీ వస్తుందనే దానిపై ఇప్పుడే వ్యాఖ్యలు చేయడం తొందరపాటు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీ కుటుంబం కంచుకోట అమేఠీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం దక్కడం తనకు దక్కిన గొప్ప గౌరవమని కేఎల్ శర్మ తెలిపారు. అమేఠీలో తనకు మద్దతుగా నిలుస్తున్న గాంధీ కుటుంబానికి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో పాటు సీనియర్ నేతలందరికీ ధన్యవాదాలు చెప్పారు. మే 20న ఐదో విడతలోనే అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలకు పోలింగ్ జరిగింది. 'ఈటీవీ భారత్'తో ఇంటర్వ్యూ సందర్బంగా కేఎల్ శర్మ చెప్పిన మరిన్ని వివరాలివీ
మమ్మల్ని గెలిపించే అంశం అదే!
తన కోసం అమేఠీలో ప్రియాంకాగాంధీ రెండు వారాల పాటు బలమైన ప్రచారం చేశారని కేఎల్ శర్మ తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ప్రచారం చేయడం తనకు ప్లస్ పాయింట్‌గా మారుతుందన్నారు. "ప్రజలు బీజేపీపై కోపంగా ఉన్నారు. ఆ పార్టీ విధానాలు ఎవరికీ నచ్చడం లేదు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది. ఆ అంశమే మమ్మల్ని అమేఠీలో గెలిపించబోతోంది. రాయ్‌బరేలీ, అమేఠీలోని బూత్ లెవల్ కాంగ్రెస్ క్యాడర్ నుంచి మాకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. మా అగ్రనేతల ప్రచారం మంచి ఫలితాలను ఇవ్వబోతోందని అందరూ అంటున్నారు. దీంతో మేమంతా రిజల్ట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం" అని కేఎల్ శర్మ తెలిపారు.
కాంగ్రెస్ క్యాడర్ శ్రమ ఫలించబోతోంది!
"మే 20న ఐదో విడతలోనే అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో నేను గత కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నాను. పోలింగ్ రోజు మా పార్టీ బూత్ ఇన్‌ఛార్జ్‌లు చాలా శ్రమించారు. ఓటర్లను పోలింగ్ స్టేషన్‌కు తరలించడంలో వారు కీలక పాత్ర పోషించారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలోనూ వారే కీలకంగా వ్యవహరించారు" అని కేఎల్ శర్మ చెప్పారు.
"ఈవీఎంలు పనిచేయకపోవడం, ఇతర పోల్ సంబంధిత సమస్యలు తలెత్తడం వల్ల నేను సైతం అమేఠీలోని పోలింగ్ బూత్‌లను మే 20న రాత్రి దాకా పర్యవేక్షించాను. ఉదయం(మే 21న) 4 గంటలకే ఇంటికి చేరుకున్నాను. మా అందరి కష్టం ఫలించబోతోంది" అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. "రాహుల్ గాంధీ కూడా మే 20న రాయ్‌బరేలీలోని పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. మేం ప్రస్తుతం పోలింగ్‌కు సంబంధించిన అన్ని సమస్యల వివరాలను సంకలనం చేస్తున్నాం. త్వరలోనే దాన్ని ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తాం" అని వెల్లడించారు.
రాహుల్‌కు రాయ్‌బరేలీ ఎందుకు?
ఈసారి కూడా అమేఠీ నుంచే రాహుల్ గాంధీ పోటీచేస్తారని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల బరిలోకి దిగారు. దీంతో అమేఠీ స్థానం అక్కడ నాలుగు దశాబ్దాలుగా విధేయంగా కాంగ్రెస్‌కు సేవ చేస్తున్న కేఎల్ శర్మకు అవకాశం దక్కింది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేఠీ నుంచే పోటీ చేయగా అక్కడ బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ గెలిచారు.
దీంతో ఈసారి రాయ్‌బరేలీ స్థానానికి రాహుల్ గాంధీ మారిపోయారు. తన రాజకీయ భవితవ్యం కోసం ఎలాగైనా ఉత్తరాది నుంచి లోక్‌సభకు గెలవాలనే పట్టుదలతో రాహుల్ ఉన్నారు. అందులో భాగంగానే 2004 నుంచి 2019 వరకు సోనియాగాంధీ వరుసగా గెలుస్తూ వచ్చిన రాయ్‌బరేలీ సీటును చివరి నిమిషంలో ఎంపిక చేసుకున్నారు. సోనియాగాంధీ రాజ్యసభకు నామినేట్ కావడం వల్ల రాయ్‌బరేలీ లోక్‌సభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అయితే రాయ్‌బరేలీ సీటులో రాహుల్‌కు ఎలాంటి ఫలితం వస్తుంది అనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది.
ఆ 10 నియోజకవర్గాలపైనే అందరి దృష్టి- కంచుకోటల్లో ఎవరు నెగ్గుతారో? - Lok Sabha Election 2024