Congress On Constitution Amendment Remarks : బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే రాజ్యాంగ సవరణపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తప్పుబట్టారు. రాజ్యాంగంలోని లౌకికవాదం, సామాజిక న్యాయానికి అధికార బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని ఆరోపించారు. ఇది మంచి ఆలోచనా విధానం కాదని, దేశంలో ఘర్షణలు సృష్టిస్తుందని చెప్పారు. రాజ్యాంగాన్ని సవరించడానికే బీజేపీ భారీ మెజారిటీని లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడారు.
"బీజేపీ రాజ్యాంగాన్ని ఇంకా పూర్తిగా ఆమోదించలేదని చెప్పడానికి బాధ పడుతున్నాను. ఒకవైపు రాజ్యాంగాన్ని మార్చబోమని ప్రధాని మోదీ చెబుతున్నారు. కానీ ఆయన పార్టీ వ్యక్తులతో మారుస్తామని చెప్పిస్తున్నారు. మూడింట రెండొంతుల మెజారిటీ వస్తే సవరిస్తామని పార్టీ నేతలు అంటున్నారు. ఇవే వ్యాఖ్యలు మా పార్టీలో ఎవరైనా చేస్తే వారిని కచ్చితంగా తొలగిస్తాను. ఒకవేళ అంబేడ్కర్‌ను బీజేపీ గౌరవిస్తే, వెంటనే అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి తొలగించాలి. వారికి ఎన్నికల్లో టికెట్లు సైతం కేటాయించకూడదు."
--మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
ఎంపీ ఏమన్నారంటే?
ఆదివారం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగిన ఒక సభలో ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని సవరించడానికి బీజేపీకి పార్లమెంటు ఉభయసభల్లో మూడింట రెండొంతులు మెజార్టీ అవసరమని పేర్కొన్నారు. "అనవసర జోడింపుల ద్వారా రాజ్యాంగాన్ని కాంగ్రెస్ వక్రీకరించింది. ముఖ్యంగా హిందూ సమాజాన్ని అణచివేయడానికి చట్టాలను తెచ్చింది. ప్రస్తుతమున్న మెజార్టీతో వీటిని మార్చడం సాధ్యం కాదు. మార్పు చేయాలంటే బీజేపీకి లోక్‌సభ, రాజ్యసభలో మూడింట రెండొంతుల ఆధిక్యం అవసరం. అలాగే మూడింట రెండొంతుల రాష్ట్రాలనూ మా పార్టీ గెల్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మాకు లోక్‌సభలోనే మెజార్టీ ఉంది. కొన్ని రాష్ట్రాలు సమ్మతించకపోవడం వల్ల పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు కావడంలేదు. రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ఆచరణలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పుడు భావిస్తోంది. లేకుంటే జాతి విద్రోహ శక్తులు రెచ్చిపోతాయి. శాంతి భద్రతలు కట్టుతప్పుతాయి. " అని అన్నారు.