Congress Ghar Ghar Guarantee : లోకసభ ఎన్నికల్లో తమ పార్టీ హామీలు ప్రతి ఇంటికి చేరే విధంగా 'ఘర్ ఘర్ గ్యారంటీ' కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని దిల్లీలోని ఉస్మాన్పుర్, కైత్వాడా నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల కుటుంబాలకు హామీలను గురించి అవగాహన కల్పించటమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఖర్గే తెలిపారు.
'ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలందరూ ప్రతి కుటుంబానికి 'పాంచ్ న్యాయ్- పచీస్ గ్యారంటీ' కరపత్రాలను పంపిణీ చేస్తారు. ప్రజల్లోకి మా హమీలను తీసుకెళ్తాం. దేశవ్యాప్తంగా ఉన్న 8కోట్ల కుటుంబాలకు అందించేలా హామీల కరపత్రాలను సిద్ధం చేశాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏమి చేస్తుందో ప్రజలకు వివరిస్తారు. మా ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల కోసం పని చేసిందని, అలాగే చేస్తుందని మేము హామీ ఇస్తున్నాం. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కానీ ప్రజలకు వాటిని ఇవ్వలేదు' అని మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.
భయపెట్టడానికే నోటీసులు
కాంగ్రెస్కు ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి బీజేపీ ప్రభుత్వం తమను భయపెట్టాలని చూస్తోందని ఖర్గే అన్నారు. 'ఐటీ శాఖ మా నిధుల నుంచి రూ. 135 కోట్లు తీసుకుంది. ప్రజాస్వామ్యంలో ఇంత పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించవచ్చా? ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. వారు దేశ రాజ్యాంగాన్ని కాపాడాలని అనుకుంటున్నారు. అయితే ప్రజలు తమకు అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించే వారికి ఎందుకు ఓటు వేస్తారో నాకు తెలియదు' ఖర్గే అన్నారు.
ఏప్రిల్ 5న మేనిఫెస్టో
'హిస్సేదారీ న్యాయ్', 'కిసాన్ న్యాయ్', 'శ్రామిక్ న్యాయ్', 'యువ న్యాయ్', 'నారీ న్యాయ్' ఇలా పాంచ్ న్యాయ్ అంశాలతో మేనిఫెస్టోను కాంగ్రెస్ సిద్ధం చేస్తోంది. ఈ మేనిఫెస్టోను ఏప్రిల్ 5న దిల్లీలో విడుదల చేయనున్నారు. ఆ మరుసటి రోజే ఏప్రిల్ 6న రాజస్థాన్‌లోని జైపుర్, హైదరాబాద్ నగరాల్లో మెగా ర్యాలీలు నిర్వహించనున్నారు. జైపుర్‌లో జరిగే మెగా ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు.
వయనాడ్ నుంచి రాహుల్ మళ్లీ పోటీ- నామినేషన్ దాఖలు - Rahul Gandhi Nomination