Congress Accounts Freeze Income Tax : లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ట్యాక్స్ రిటర్న్స్‌లో వ్యత్యాసాలపై ఐటీ శాఖ విధించిన జరిమానాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆదాయ పన్ను శాఖ అప్పిలేట్ ట్రైబ్యునల్ కొట్టివేసింది. కాగా, ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ, వీలైనంత త్వరలో హైకోర్టును ఆశ్రయించనుంది.
"ట్రైబ్యునల్ తీర్పుపై న్యాయపరమైన చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే దీనిపై దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సార్వత్రిక ఎన్నికల ముందు సమయాన్ని ఎంపిక చేసుకుని మాపై దాడి చేసింది. మా ఖాతాలను ఫ్రీజ్ చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లే. రూ.270 కోట్ల నిధులను ఫ్రీజ్ చేశాక, ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని ఎలా అనుకుంటాం."
--అజయ్ మాకెన్, కాంగ్రెస్ కోశాధికారి
'త్వరలోనే హైకోర్టుకు వెళతాం'
ఆదాయపన్ను శాఖ అప్పిలేట్ ట్రైబ్యునల్ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ లీగల్ హెడ్ వివేక్ టంఖా స్పందించారు. ఈ నిర్ణయం తమను నిరాశ పరిచిందని, దీనిపై వీలైనంత త్వరగా హైకోర్టుకు వెళతామని చెప్పారు. జరిమానా మొత్తంలో 20శాతం చెల్లించడానికి అనుమతిస్తూ అంతకుముందు తీసుకున్న నిర్ణయాలను, ఇప్పుడు పాటించడం లేదని ఆరోపించారు.
2018-19 సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నుల విషయంలో ఆదాయపు పన్ను విభాగం గతంలో కాంగ్రెస్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. వీటిపై పార్టీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో చర్యలు చేపట్టిన ఆదాయపు పన్ను శాఖ, ఇటీవల రూ.210 కోట్ల పన్ను రికవరీ కోసం కాంగ్రెస్‌కు చెందిన పలు ప్రధాన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. దీనిపై పార్టీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడం వల్ల స్వల్ప ఊరట లభించింది. దీనిపై తదుపరి విచారణ చేపట్టేంత వరకు బ్యాంకు ఖాతాలను యథావిధిగా నిర్వహించుకునేందుకు ట్రైబ్యునల్ అనుమతిని ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖాతాలను పునరుద్ధరించారు. అయితే, ఈ వ్యవహారం పెండింగ్‌లో ఉండగానే ఇటీవల ఐటీ అధికారులు తమ బ్యాంకు ఖాతాల నుంచి రూ.65కోట్లు విత్‌డ్రా చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. తమ అకౌంట్లపై ఐటీ విభాగం ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసింది.
'కాంగ్రెస్ ఖాతాల నుంచి అక్రమంగా రూ.65కోట్లు విత్‌డ్రా'- ఐటీ శాఖపై హస్తం పార్టీ ఫైర్'
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్'- రాహుల్ న్యాయ్ యాత్రపై ఎఫెక్ట్!