Congress Never Understood Poor Says PM Modi : స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పేదల అవసరాలను కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారి బాధలను ఎప్పుడూ అర్థం చేసుకోలేదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి దేశానికి గుర్తింపుగా మారిందన్నారు. కొవిడ్ సమయంలో పేద ప్రజలు ఏమైపోతారోనని అంతా అనుకున్నారని, కానీ తాను వారికి ఉచిత రేషన్, వ్యాక్సిన్ ఇచ్చానని తెలిపారు. తమ ప్రభుత్వం కృషి వల్ల 25 కోట్ల మంది దారిద్ర్య రేఖ ఎగువకు వచ్చారని ప్రధాని అన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వానికి మద్దతిచ్చినందుకు ప్రజలకు ప్రధాని కృతజ్ఞతలు చెప్పారు. కోట్టాది మంది దేశ ప్రజలు, తల్లులు, సోదరీమణులు తనకు రక్షణ కవచం అయ్యారని మోదీ అన్నారు.
"స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తమకు దేశాన్ని దోచుకునే లైసెన్స్ వచ్చిందని కాంగ్రెస్ భావించింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ దోచుకునే లైసెన్సులను నేను రద్దు చేశాను. మా ప్రభుత్వంలో పేదల ఖాతాల్లోకి రూ.34లక్షల కోట్లను వేశాము. ఆ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరింది. ఎప్పుడైతే నేరుగా డబ్బు లబ్ధిదారులకు చేరిందో అప్పుడే కాంగ్రెస్‌కు దోచుకునే ఛాన్స్ లేకుండా పోయింది. మోదీ వారి లైసెన్సులు రద్దు చేయడానికి కారణం మీరు(ప్రజలు) మోదీకి లైసెన్సు ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి వారి దుకాణం మూతపడింది. దోచుకునే లైసెన్సు పోయినందుకు వారు మోదీని దుర్భాషలాడతారా లేదా? మరి మోదీని ఎవరు రక్షిస్తారు? నన్ను ఎవరు రక్షిస్తారు? దేశంలోని కోట్లాది ప్రజలు, నా తల్లులు, చెల్లెళ్లు నేడు నాకు రక్షా కవచంగా మారారు."
--నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి
'గిరిజనులను కాంగ్రెస్ అవమానించింది'
గిరిజనులను కాంగ్రెస్ అవమానించిందని, కానీ ఇప్పుడు అదే గిరిజన బిడ్డ దేశ తొలి గిరిజన రాష్ట్రపతి అయ్యారని మోదీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు బీజేపీ తొలి గిరిజన ముఖ్యమంత్రిని ఇచ్చిందని గుర్తుచేశారు. గిరిజనులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసిన బీజేపీ, గిరిజన సంక్షేమానికి గత పదేళ్లలో ఐదు రెట్లు బడ్జెట్ పెంచిందని తెలిపారు. ఇప్పుడు దేశ ప్రజలందరూ 'కర్చ్ కమ్ కరాయే, బచత్ బడాయే బార్ బార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్' అంటున్నారని చెప్పారు.