How To Make Hotel Style Coconut Chutney : ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం.. ఇలా ఏ టిఫెన్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏది? అని అడిగితే.. ఎక్కువ మంది వెంటనే చెప్పే సమాధానం.. కొబ్బరి చట్నీ. రుచితో పాటు తేలికగా జీర్ణమయ్యే ఈ పచ్చడిని చాలా మంది ఇష్టపడి తీసుకుంటుంటారు. ఈ చట్నీ రుచికరంగా ఉండడమే కాదు.. దీనివల్ల ఆరోగ్యానికీ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అయితే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కొబ్బరి చట్నీని ప్రతిసారిలా కాకుండా ఈసారి వెరైటీగా హోటల్ స్టైల్లో ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. టేస్ట్ అదుర్స్ అనిపించేలా ఉంటుంది. పైగా ప్రిపరేషన్ వెరీ ఈజీ! మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ చట్నీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు :
- కొబ్బరి కాయ - ఒకటి
- పచ్చి మిర్చి -4 నుంచి 5
- వెల్లుల్లి రెబ్బలు - 4
- శనగపప్పు - ఒక టేబుల్ స్పూన్
- అల్లం తరుగు - కొద్దిగా
- నిమ్మరసం - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
- కరివేపాకు - 2 రెమ్మలు
తాలింపు కోసం :
- 2 టేబుల్ స్పూన్లు - నూనె
- ఒక టీస్పూన్ - ఆవాలు
- ఒక టీస్పూన్ - జీలకర్ర
- 2 టేబుల్ స్పూన్లు - మినప్పప్పు
- 1 టేబుల్ స్పూన్ - శనగపప్పు
- 2 - ఎండు మిర్చి
- కొద్దిగా - కరివేపాకు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా పచ్చికొబ్బరిని(Coconut) చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును గోరువెచ్చని నీళ్లలో నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, పొట్టుతీయని వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టిన శనగపప్పు, అల్లం తరుగు, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆపై అందులో కాస్త వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం తాలింపు కోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి గోధుమ రంగులోకి మారే వరకు వేయించుకోవాలి.
- ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న కొబ్బరి పేస్ట్లోకి కొద్దిగా నిమ్మరసం, సగం తాలింపు మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
- చివరగా సర్వింగ్ బౌల్‌లో ఈ మిశ్రమాన్ని వడ్డించుకుని మిగిలిన తాలింపుతో గార్నిష్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ" రెడీ!
ఇవీ చదవండి :
టిఫెన్ సెంటర్ రుచిలో "అల్లం చట్నీ" - పదే పది నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి!
టిఫెన్ స్పెషల్ : "రాయలసీమ పల్లీ చట్నీ" - పదే పది నిమిషాల్లో రెడీ!