Chandigarh Mayor Resign : చండీగఢ్ మేయర్, బీజేపీ నేత మనోజ్ సోంకర్ తన పదవికి రాజీనామా చేశారు. సోంకర్ తన రాజీనామా పత్రాన్ని మున్నిపల్ కమిషనర్‌కు సమర్పించినట్లు బీజేపీ వెల్లడించింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న కేసు సోమవారం సుప్రీంకోర్టు విచారణకు రానున్న నేపథ్యంలో ఈ పరిణామం జరగడం గమనార్హం. మరోవైపు, మేయర్ రాజీనామా చేసిన రోజే ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్) కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. కొత్తగా బీజేపీలోకి మారిన వారితో కలిపితే బీజేపీ కౌన్సిలర్ల సంఖ్య 14కు చేరింది. ఆప్‌నకు 13, కాంగ్రెస్‌కు 7, శిరోమణి అకాలీదళ్‌కు ఒక కౌన్సిలర్ ఉన్నారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి బీజేపీ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో మోసాలకు పాల్పడిందని ఆప్, కాంగ్రెస్‌లు ఆరోపిస్తున్నాయి. జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సొంకర్, ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌పై విజయం సాధించారు. ఆప్ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అప్పుడు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు.
రిటర్నింగ్ అధికారిపై సుప్రీం కోర్టు ఫైర్
ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 5న విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎన్నికల అధికారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసినట్లు వీడియో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. 'ఎన్నికల నిర్వహణ తీరు ఇదేనా? ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇది ప్రజాస్వామ్యం హత్యే. ఆయనపై విచారణ జరపాలి' అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీని భద్రపరచాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి వ్యక్తిగతంగా హజరు కావాలని చెప్పి, తదుపరి విచారణను ఫిబ్రవరి 19కు వాయిదా వేసింది.
రైతు నేతలతో కేంద్రం నాలుగో విడత చర్చలు- కాలయాపన చేయొద్దని కోరిన రైతులు
'కేంద్రం ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తుంది'- బంగాల్ సీఎం దీదీ ఆరోపణలు